‘అప్పు’డే..

ABN , First Publish Date - 2022-07-18T06:27:24+05:30 IST

‘అప్పు’డే..

‘అప్పు’డే..
పీటీ కొత్తూరులోని టిడ్కో ఇళ్లు

రుణాల రికవరీలట..!

టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు.. ఇళ్ల కేటాయింపులూ లేవు

తీసుకున్న రుణాలకు డబ్బు కట్టాలట

లబ్ధిదారుల ఖాతాల నుంచి డబ్బు లాగేస్తున్న బ్యాంకులు

తలలు పట్టుకుంటున్న తిరువూరులోని లబ్ధిదారులు


టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికానే లేదు. అసలు పూర్తవుతుందో లేదో కూడా తెలియదు. ఆ ఇళ్లు లబ్ధిదారుల చేతికి ఎప్పుడు ఇస్తారో కూడా అనుమానమే. అప్పుడే బ్యాంకులు రుణాల రికవరీని మొదలుపెట్టాయి. ఉన్నట్టుండి తమ ఖాతాల్లో డబ్బు మాయమవుతుండటంతో తిరువూరులోని పీటీ కొత్తూరులోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 


తిరువూరు, జూలై 17 : ఆంధ్రప్రదేశ్‌ పట్టణ నివాస సముదాయాలు-మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో 2017లో పట్టణ పరిధిలోని సుమారు ఐదు ఎకరాల్లో 1,700 మంది కోసం ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ, లబ్ధిదారుల వాటాతో పాటు వారి పేరుతోనే బ్యాంక్‌ రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం ప్రారంభించి సుమారు ఐదేళ్లు అవుతున్నా నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇంటి పొజిషన్‌ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. కానీ, బ్యాంక్‌ మాత్రం రుణాల రికవరీ మొదలుపెట్టింది. మరోవైపు టిడ్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో సంస్థ టెండర్‌ దక్కించుకుందని, త్వరలో పనులు ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

ఇంటి పొజిషన్‌ ఇవ్వకుండా.. 

ఇళ్లకు పొజిషన్‌ కల్పించకుండానే రుణాల రికవరీ కోసం తమ ఖాతాల్లో ఉన్న నగదును బ్యాంక్‌ అధికారులు జమ చేసుకుంటున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల ఇంటి యూనిట్‌ ధర రూ.5.72 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా రూ.500. ఇందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, బ్యాంక్‌ రుణం రూ.2,71,500. కేటగిరీ-2లో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటికి యూనిట్‌ ధర రూ.6.74 లక్షలు కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రూ.3 లక్షలు, లబ్ధిదారుడి వాటా రూ.50 వేలు, కేటగిరీ-3లో డబుల్‌ బెడ్‌రూమ్స్‌ యూనిట్‌ ధర రూ.7.71 లక్షలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రూ.3 లక్షలు. లబ్ధిదారుడి వాటా రూ.లక్ష (నాలుగు విడతల్లో చెల్లింపు), బ్యాంక్‌ రుణం రూ.3.71 లక్షలు. కాగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాక ఆయా బ్యాంకుల నుంచి ఎంపికైన లబ్ధిదారుల పేరుతో సంస్థ రుణాలు తీసుకుంది. నేటికీ టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉండగా, మంజూరైన రుణం తాలూకా వాయిదాలను మాత్రం లబ్ధిదారుల ఖాతాల నుంచి లాక్కుంటున్నారు. తమ ఖాతాల నుంచి నగదు తగ్గుతుందని కొందరు బ్యాంక్‌ మేనేజరును కలవగా, టిడ్కో ఇళ్ల రుణ వాయిదాలు జమ అవుతున్నాయని చెప్పారు. 

దారి సమస్య

పీటీ కొత్తూరులో మరో 17 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లకు దారి సమస్య వెంటాడుతోంది. మధిర ప్రధాన రహదారికి సమీపంలో ప్రభుత్వానికి సంబంధించిన 17 ఎకరాల్లో టిడ్కో ఇళ్లు నిర్మించారు. ప్రధాన రహదారి నుంచి ఇళ్లకు వెళ్లేందుకు దారి నిర్మాణం నిమిత్తం ఓ రైతుకు చెందిన సాగుభూమిలో 60 సెంట్లు కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేశారు. ఈ భూమికి నగదు చెల్లించకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 


రుణాల రికవరీ నిబంధనలకు విరుద్ధం

టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లతో మంజూరైన రుణాలు ఇళ్లు కేటాయించిన 24 నెలల తరువాతే రికవరీ చేయాలి. ఇప్పటికిప్పుడు రికవరీ అనేది నిబంధనలకు విరుద్ధం. కొందరు లబ్ధిదారులు ఇళ్ల కోసం నగదు చెల్లించినా, సాంకేతికపరమైన కారణంతో వారికి మంజూరైన ఇంటిని రద్దు చేశారు. వారు చెల్లించిన నగదు తిరిగి వారి ఖాతాలకు జమ అవుతుంది.

 - బి.చిన్నోడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌

Read more