మైలవరంలో మళ్లీ ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2022-12-16T01:13:10+05:30 IST

అసలే రాజకీయ కాక రేగుతున్న మైలవరం నియోజకవర్గంలో సీఎం జగన్‌ గురువారం నిర్వహించిన సమావేశంతో మరింత వేడి రాజుకుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేశ్‌ వర్గీయుల నడుమ మరో కొత్త చర్చకు ఈ సమావేశం దారి పరిచింది.

మైలవరంలో మళ్లీ ఉత్కంఠ..!

మైలవరంలో వైసీపీని గెలిపించుకురావాలన్న జగన్‌

అభ్యర్థి పేరు ప్రస్తావించలేదన్న జోగి రమేశ్‌ వర్గం

వసంతకు టికెట్‌ లేనట్టేనంటూ ప్రచారం

అభ్యర్థి విషయంలో నిర్ణయం జగనదేనన్న వసంత

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : అసలే రాజకీయ కాక రేగుతున్న మైలవరం నియోజకవర్గంలో సీఎం జగన్‌ గురువారం నిర్వహించిన సమావేశంతో మరింత వేడి రాజుకుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేశ్‌ వర్గీయుల నడుమ మరో కొత్త చర్చకు ఈ సమావేశం దారి పరిచింది. గత నియోజకవర్గ సమీక్షల్లో సీఎం నేరుగా ఫలానా అభ్యర్థి అంటూ పేరుచెప్పి, ఆ అభ్యర్థిని గెలిపించుకురావాలని వ్యాఖ్యానించారని, మైలవరంలో అలా జరగలేదని జోగి వర్గం చెబుతోంది. కేవలం పార్టీ పేరును ప్రస్తావిస్తూ వైసీపీని గెలిపించుకురావాలని జగన్‌ పేర్కొనడంతో రానున్న ఎన్నికల్లో మైలవరం అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ను కొనసాగిస్తారా లేక మంత్రి జోగి రమేశ్‌ ఆశిస్తున్న విధంగా ఆయనకు మైలవరం కేటాయిస్తారా అనే దానిపై మరోసారి అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఎవరి భాష్యం వారిది

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అక్రమాలు, ఆయన తండ్రి నాగేశ్వరరావు ఇటీవల కమ్మ సామాజికవర్గానికి వైసీపీ హయాంలో అన్యాయం జరిగిపోతోందన్నట్టు మాట్లాడిన మాటలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయని, అందుకే మైలవరం విషయంలో జగన్‌ నిక్కచ్చిగా ఉన్నారని జోగి వర్గం ప్రచారం చేస్తోంది. ఎన్టీటీపీఎస్‌లో బూడిద దోపిడీ నుంచి కొండపల్లి అడవుల్లో అక్రమ క్వారీయింగ్‌, ఇసుక దోపిడీ వంటివన్నీ వసంత కృష్ణప్రసాద్‌పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయని, ఆయనకు టికెట్‌ ఇస్తే ఈసారి పార్టీకి ఓటమి తప్పదని, అందుకే జగన్‌ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నారని చెబుతోంది. అయితే, కృష్ణప్రసాద్‌ వర్గం మాత్రం ఈసారి సీటు తమ నాయకుడిదేనని, జగన్‌ ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేశారని చెబుతోంది. మైలవరంలో కృష్ణప్రసాద్‌కు సీటు ఇస్తున్నామని సీఎం.. కార్యకర్తలు, నాయకులకు చెప్పినట్లు ప్రచారం చేసుకుంటోంది.

జగన్‌ నిర్ణయమే శిరోధార్యం : ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

‘మైలవరం శాసనసభా నియోజకవర్గ అభ్యర్థి ఎవరో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయమే శిరోధార్యం’ అని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ చెప్పారు. జగన్‌ నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి జోగి రమేశ్‌, కృష్ణప్రసాద్‌ మధ్య ఉన్న గొడవలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీలో సమస్యలను పరిష్కరించుకోవాలని, మైలవరంలో వైసీపీని తిరిగి గెలిపించుకురావాలని సీఎం ఆదేశించారు. ‘వారంలో మైలవరం నియోజకవర్గంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. జోగి రమేశ్‌, కృష్ణప్రసాద్‌ను పిలిచి వివాదాన్ని పరిష్కరిస్తా’ అని జగన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-16T01:13:12+05:30 IST