అక్రమాలకు ‘రీచ్‌’ అయ్యారు

ABN , First Publish Date - 2022-11-30T00:48:06+05:30 IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత. అధికారం ఉండగానే ఇసుకను దోచేయాలనేది వైసీపీ నాయకుల సామెత. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇసుక రీచ్‌లను సబ్‌ కాంట్రాక్టు ద్వారా తన చెప్పుచేతల్లోకి తీసుకున్న ఓ వైసీపీ నేత అక్రమంగా సామాన్యులకు ఇసుకను దూరం చేస్తుంటే, ఇలా దోచుకున్న కోట్ల రూపాయల్లో తమకూ వాటాలు ఇవ్వాలని మిగతా నేతలు కొట్టుకుచస్తున్నారు.

అక్రమాలకు ‘రీచ్‌’ అయ్యారు

జేపీ సంస్థ నుంచి సబ్‌ కాంట్రాక్టు

ఏడాదికి రూ.120 కోట్లు చెల్లించేలా ఒప్పందం

తమకూ వాటాలు కావాలంటున్న స్థానిక నేతలు

లారీ ఇసుక రూ.30వేల పైచిలుకే..

సామాన్యుడికి చుక్కలు.. వైసీపీ నేతలకు కాసులు..

(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌ల కాంట్రాక్టు పొందిన సంస్థ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రీచ్‌లను కొద్దిరోజుల కిందట ఓ వైసీపీ నేతకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఈ వైసీపీ నేత సబ్‌ కాంట్రాక్టును దక్కించుకుని సుమారు నెల గడుస్తోంది. నాటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలకు బ్రేక్‌ వేశారు. సామాన్య కొనుగోలుదారులు ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే, సాంకేతిక కారణాలతో బుక్‌ కానట్లు చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ జరిగితే ప్రభుత్వ ధర ప్రకారం టన్ను రూ.475కు విక్రయించాలి. ఈ లెక్కన విజయవాడకు చెందినవారు 18 టన్నుల ఇసుక బుక్‌ చేసుకుంటే, ఇసుకకు రూ.8,550, రవాణా చార్జీలుగా సుమారు రూ.8వేలు.. మొత్తం రూ.16,550 చెల్లించాలి. ఇది కూడా మూడేళ్ల క్రితం ధర కంటే రెట్టింపు. అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవడం అనేది అసాధ్యం. సచివాలయాల్లో బుక్‌ చేసుకోవచ్చని చెబుతున్నా అదేమీ జరగట్లేదు. ఫలితంగా భవన నిర్మాణదారులు దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో టన్ను ఇసుక రూ.1,200 నుంచి రూ.1,300 పలుకుతోంది. దళారులకు ఇసుక అమ్ముకుంటేనే సదరు వైసీపీ నేతకు భారీగా కాసులు మిగులుతాయి. 18 టన్నుల ఇసుక దళారుల ద్వారా కొంటే రూ.23,400 అవుతుంది.

ఏడాదికి రూ.120 కోట్లు

ఎవరికి చేరుతోంది..?

సబ్‌ కాంట్రాక్టు దక్కించుకున్నందుకు సదరు వైసీపీ నేత ఏడాదికి రూ.120 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మొత్తం ఎవరికి చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు ఈ మొత్తం వెళ్లడం లేదని, వైసీపీలోని కొందరు పెద్దలకు చేరుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి విడతగా రూ.60 కోట్లు సమర్పించుకున్న జిల్లాకు చెందిన వైసీపీ నేత మలివిడతగా మరో రూ.60 కోట్లు సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వాటాల కోసం కొట్లాట..!

జిల్లాలో ఇసుక రీచ్‌లపై ఆధిపత్యం చెలాయిస్తున్న వైసీపీ నేతపై మిగిలిన ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇసుక రీచ్‌లు ఉన్న నందిగామ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, పెనమలూరు తదితర నియోజకవర్గాల్లో స్థానిక వైసీపీ నాయకులు తమకు సైతం ఎంతో కొంత వాటాలు ఇవ్వాలని రీచ్‌లను దక్కించుకున్న నేతను నిలదీస్తున్నట్లు సమాచారం. తాను నేరుగా పెద్దలతోనే మాట్లాడుకున్నానని, వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదని సదరు వైసీపీ నేత స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దివిసీమ ప్రాంతంలో స్థానిక వైసీపీ నేత చోటామోటా నాయకులను రెచ్చగొట్టి ఇసుకను ఎడ్లబండ్లపై పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎడ్లబండ్లపై తరలిస్తే మీకేంటి అభ్యంతరం అని ఎదురుదాడి చేస్తున్నారు. దివిసీమలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియాను ఆయన పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2022-11-30T00:48:06+05:30 IST

Read more