Storm: ఈ సాయంత్రానికి తుఫానుగా బలపడనున్న తీవ్రవాయుగుండం
ABN , First Publish Date - 2022-12-07T11:44:51+05:30 IST
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 770 కి.మీ. చెన్నైకి 830 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 770 కి.మీ. చెన్నైకి 830 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం బుధవారం తీవ్రవాయుగుండం సాయంత్రానికి తుఫానుగా బలపడనుంది. గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర తీరాలకు తుఫాన్ చేరనుంది. దీని ప్రభావంతో గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి.., రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఆయా ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని సూచించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.