ఈవో.. డౌన్‌ డౌన్‌..!

ABN , First Publish Date - 2022-10-03T06:29:18+05:30 IST

అసలే భక్తుల రద్దీ.. ఆపై అమ్మవారిని దర్శించుకోవాలనే కోరిక.

ఈవో.. డౌన్‌ డౌన్‌..!
ఎవరినీ అనుమతించనంటూ వీఐపీ గేటు వద్ద కుర్చున్న ఈవో భ్రమరాంబ

వీఐపీల తాకిడితో నిలిచిన క్యూలైన్లు

ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు

ఈవో రాకతో ఆగిన వీఐపీల తాకిడి

లబ్బీపేట, పాతరాజరాజేశ్వరి పేట, అక్టోబరు 2 : అసలే భక్తుల రద్దీ.. ఆపై అమ్మవారిని దర్శించుకోవాలనే కోరిక. పైగా చేతిలో చిన్నపిల్లలు.. తోసుకుంటూ ముందుకు వెళ్దామన్నా కదలని క్యూలైన్లు. ఇంతలో పక్కనుంచి వీఐపీలమంటూ వందల సంఖ్యలో దర్శనానికి వెళ్తున్న వారిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు ఈవో.. డౌన్‌ డౌన్‌ అంటూ తమ అసహనాన్ని వెళ్లబుచ్చారు. 4, 5 గంటల క్యూలైన్‌లో అవస్థలు పడి ఘాట్‌రోడ్‌ మహాద్వారం వద్దకు చేరుకున్న భక్తులను ఆపి పక్క నుంచి వీఐపీలను పంపించడంతో తమ కోపాన్ని చూపించారు. విషయాన్ని కొందరు ఉద్యోగులు ఈవో దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆమె వీఐపీ గేటు వద్ద కూర్చొని భక్తులు ఇబ్బందులు పడుతున్నారంటూ, ఎవరిని పంపేది లేదంటూ, ఎవరొచ్చినా చేతిని అడ్డుపెట్టిమరీ ఆపారు. ఒకదశలో ఒక పోలీసు మహిళ అధికారి తమవారిని పంపేందుకు వస్తూ అక్కడ ఈవోను చూసి ఈ గొడవ తనకెందుకనుకుంటూ క్యూలైన్‌లోనే పంపించింది. అదే సందర్భంలో ఒక సీఐ లోపలికి వెళ్తుండగా ఆపి మీరెందుకు వెళ్తున్నారని చేయి అడ్డుపెట్టింది. తాను విధుల్లో ఉన్నానని చెప్పగా, లోపల ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు.. ఆలయ ప్రాంగణంలో అంతా పోలీసులే కనిపిస్తున్నారని, ఉన్నవారు చాలక కొత్తగా లోపలికి వెళ్లి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని అటువైపు వెళ్లే పోలీసులకు చెప్పారు. దాదాపు అరగంట పైగా అక్కడే ఉన్న ఆమె ఏ శాఖ వారు వచ్చిన ఎవరైనా తగ్గేదే లే.. అంటూ కూర్చుంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు చేసేదేమీ లేక అటువైపు ఎవరొచ్చినా క్యూలైన్‌లోనే పంపించారు. ఇంతలో మంత్రి కొట్టు సత్యనారాయణ పిలవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లగా మళ్లీ వీఐపీల తాకిడి యథా రాజా తథా ప్రజా అన్నట్టు సాగాయి.

దుర్గమ్మ ఆదాయం రూ. 60లక్షలు

దసరా నవరాత్రుల్లో 6వ రోజు శనివారం వివిధ సేవల టికెట్లు, ప్రసాదాలు అమ్మకాల ద్వారా రూ. 60,59,248 ఆదాయం వచ్చినట్లు ఈవో డి. భ్రమరాం బ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 టికెట్ల అమ్మకాల ద్వారా రూ.21,27,000, రూ.300 టి కెట్ల అమ్మకాల ద్వారా 10,50,300, రూ.100 టిక్కెట్లు అమ్మకం ద్వారా రూ.7,67,400 ఆర్జించడం జరిగిందని వివరించారు. అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ.17,66,325, ఇతర సేవలు ద్వారా రూ. 2,88,223 ఆదాయం సమకూరినట్లు ఆమె ప్రకటలో తెలిపారు.

Read more