ఫుట్‌పాత్‌లపై అమూల్‌కు 45 షాపులా?

ABN , First Publish Date - 2022-02-19T06:26:35+05:30 IST

అమూల్‌ సంస్థకు నగరంలోని ఫుట్‌పాత్‌లపై 45 షాపులు కేటాయించేందుకు తీర్మానం చేశారని, దీనిని తక్షణం రద్దు చేయాలని టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు.

ఫుట్‌పాత్‌లపై అమూల్‌కు 45 షాపులా?

కౌన్సిల్‌లో చర్చకు తమ ప్రశ్నలను తొలగించడంపై నిలదీస్తాం : టీడీపీ కార్పొరేటర్లు

విద్యాధరపురం, ఫిబ్రవరి 18 : అమూల్‌ సంస్థకు నగరంలోని ఫుట్‌పాత్‌లపై 45 షాపులు కేటాయించేందుకు తీర్మానం చేశారని, దీనిని తక్షణం రద్దు చేయాలని టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ నెలిబండ్లబాలస్వామి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో తాము రెండు ముఖమైన అంశాలకు సంబంధించి సంధించిన రెండు ప్రశ్నలను అజెండా నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించేందుకు రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేస్తే వాటిని అజెండా నుంచి తొలగించడం అభ్యంతరకరమన్నారు. టీడీపీ కార్పొరేటర్ల ప్రశ్నలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు వీటిలో కూడా పక్ష పాత వైఖరి అవలంభించడం సరికాదన్నారు. దీనిని తాము తీవ్రంగా తప్పుపడుతున్నామని, కౌన్సిల్‌లో దీనిపై నిలదీస్తామన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. అధికారపక్షం అబద్దాలతో కాలం గడిపేస్తోందన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కౌన్సిల్‌ సమావేశంలో కూర్చుని తన సొంత పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాకపోగా తన నియోజకవర్గంలో సొంత పనులకు కార్పొరేషన్‌ డబ్బును చెల్లిస్తూ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాసాలను ఉచితంగా ఇస్తామన్న ఎన్నికల హామీని సీఎం గాలిలో కలిపేశారన్నారు. లేకుంటే ఆందోళన చేపతామన్నారు. కొండప్రాంతాల్లోని ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుంటే వారి నుంచి పన్నులు వసూలు చేయడం సరికాదన్నారు. మంత్రి వెలంపల్లి ఇంటికి సమీపంలోనే యుజీడీ పనులు ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. అధికార వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని, ఆ పార్టీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి, వీరమాచినేని లలిత, చెన్నగిరి రామమోహనరావు, చెన్నుపాటి కాంతి శ్రీ, వల్లభనేని రాజేశ్వరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:26:35+05:30 IST