సుర్రుమన్న సూరీడు

ABN , First Publish Date - 2022-05-25T06:19:48+05:30 IST

సుర్రుమన్న సూరీడు

సుర్రుమన్న సూరీడు

జిల్లావ్యాప్తంగా మండుటెండలు, వేడిగాలులు

రెండు రోజులుగా 40 డిగ్రీల కంటే అధికంగా..

మంగళవారం విజయవాడలో 43.6 డిగ్రీలు నమోదు

రాత్రి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకు చేరిక

నేటి నుంచి రోహిణీ కార్తె

జూన్‌ 7 వరకూ ఇదే పరిస్థితి


విజయవాడ, మే 24 (ఆంధ్రజ్యోతి) : అధిక ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే విజయవాడలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలోనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. 

రెండు రోజులుగా ఇదే పరిస్థితి

రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో అత్యవసర పనులపై రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలులు నలువైపుల నుంచి వీస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. రాత్రి సమయంలోనూ ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతుండగా, రాత్రి పది గంటలకు కూడా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. 

నేటి నుంచి మరింత అధికం

రోహిణీ కార్తె బుధవారం నుంచి ప్రారంభమైౖ జూన్‌ 7వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ పది రోజులు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, రాజస్థాన్‌ నుంచి వస్తున్న థండర్‌ స్ట్రామ్స్‌ కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.Updated Date - 2022-05-25T06:19:48+05:30 IST