చిన్నారులకు పెద్ద పరీక్ష!

ABN , First Publish Date - 2022-09-18T05:06:37+05:30 IST

పాఠశాల విద్యకు సంబంధించి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది.

చిన్నారులకు పెద్ద పరీక్ష!

1 నుంచి 8 తరగతుల వరకు ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా ఫార్మటివ్‌-1 పరీక్షలు

దసరా సెలవుల తరువాత నిర్వహణ

ఒక్కో సబ్జెక్ట్‌కు 20 మార్కులు

అందులో 15 మార్కులకు బిట్స్‌, 5 మార్కులకు ప్రశ్నలు

అన్ని సబ్జెక్టులకు ఒకే ఓఎమ్మార్‌ షీట్‌

పాఠశాల విద్యకు సంబంధించి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది. దసరా సెలవులకు ముందే సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఈసారి దసరా సెలవుల తరువాత పరీక్షలు నిర్వహిస్తోంది. గతంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి విద్యార్థులకు ఇచ్చి జవాబులు రాయించేవారు. ఈసారి ఓఎమ్మార్‌ షీట్లలో జవాబులు రాసేలా పరీక్షల విధానాన్ని మార్చేశారు. ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి ఉపాధ్యాయులతో యూట్యూబ్‌ లింక్‌ ద్వారా ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఓఎమ్మార్‌ షీట్‌ల ద్వారా ఫార్మటివ్‌-1, 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ విధానం అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందా, ఉండదా అనే అంశంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : నూతన విధానంలో ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా నిర్వహించే పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఒక్కో సబ్జెక్టులో 15 మార్కులకు బిట్స్‌ ఉంటాయి. మరో 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థికి ఇచ్చిన ఓఎమ్మార్‌ షీట్‌లో  ఏబీసీడీలలో బిట్స్‌కు జవాబులు గుర్తించాల్సి ఉంది. మిగిలిన 5 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తారు. ఈ ఐదు మార్కులకు జవాబులను విద్యార్థులు రాయాల్సి ఉంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్‌ షీట్‌ ఉంటుంది. మొదటిరోజు తొలి పరీక్ష రాసిన తరువాత ఓఎమ్మార్‌ షీట్‌ను ఉపాధ్యాయుడికి అప్పగించాలి. తరువాతి రోజున మరో సబ్జెక్టుకు పరీక్ష జరిగితే అందుకు కాలమ్‌లో రెండో సబ్జెక్టుకు జవాబులను ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా గుర్తించాల్సి ఉంది. 9, 10 తరగతులకు పరీక్షలు ఓఎమ్మార్‌ షీట్‌ పద్ధతిలో కాకుండా పాత పద్ధతిలో ప్రశ్నాపత్రాలు ఇచ్చి పరీక్షలు నిర్వహించనున్నారు.

సాధ్యమవుతుందా..?

ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించే ప్రతిపాదనను అమలు చేయడం ఎంతమేర సాధ్యమవుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతోనే దసరా సెలవులకు ముందు నిర్వహించాల్సిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తున్నారని టీచర్లు అంటున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసిన అనంతరం ఓఎమ్మార్‌ షీట్లను ఎక్కడ స్కానింగ్‌ చేస్తారనే అంశంపైనా ఇంకా స్పష్టత లేదు. 

విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేదెలా..

 ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు చదువులో ఉన్న సామర్థ్యం ఎలా అంచనా వేయాలని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి పరీక్షరాస్తే, ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం రాసినా, రాయకున్నా సంబంధిత విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని టీచర్లు అంటున్నారు. విద్యార్థులను ఎదురుగా పెట్టుకుని జావాబు పత్రాలు దిద్దుతుంటే టీచర్లకు, విద్యార్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న సామర్థ్యంపై అవగాహన వస్తుందని టీచర్లు అంటున్నారు. అఽధిక శాతం మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే, పాఠాలు చెప్పే తీరును మార్చుకుని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెబుతామని టీచర్లు అంటున్నారు. విద్యార్థి విన్న, చదివిన పాఠాలు చేతిరాతతో పరీక్షరాస్తేనే పూర్తిస్థాయిలో అవగాహన వస్తుందని, గుర్తుండిపోతుందని టీచర్లు చెబుతున్నారు. అలా కాకుండా ఎదో పెద్ద ఉద్యోగానికి పరీక్ష రాసినట్లుగా ఓఎమ్మార్‌ షీట్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 ఒకటో తరగతి విద్యార్థికి ఓఎమ్మార్‌ షీట్‌ అవసరమా?

పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులు చేరి మూడు, నాలుగు నెలలు కాకముందే ఈ తరగతి విద్యార్థులకు ఓఎమ్మార్‌షీట్‌ ఇచ్చి జవాబులు గుర్తించమనడం విస్మయం గొలిపే అంశం. 1వ తరగతి విద్యార్థులు టీచరు, లేదా సహ విద్యార్థులు చెప్పిన చిన్నపాటి పదాలను, పద్యాలను గుర్తుంచుకుంటారు. నోటితో చెప్పగలుగుతారు. కానీ చేతిరాత రూపంలో రాయలేని స్థితిలో ఉంటారు. వీరికి ఓఎమ్మార్‌ షీట్‌లు ఇచ్చి పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని టీచర్లు  ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 2,3 తరగతులు చదివే విద్యార్థుల్లో సగం మందికిపైగా చదువులో వెనుకబడే ఉంటారు. అలాంటి వారికి ఓఎమ్మార్‌ షీట్లు ఇచ్చి జవాబులు గుర్తించమంటే ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహించే ప్రతిపాదన ఉందని, ఈ విధానం ఎంతవరకు అమలు చేస్తారు? మార్పులేమైనా చేస్తారా? అనే అంశంపై తగు ఉత్తర్వులు కోసం ఎదురుచూస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఫార్మటివ్‌-1 పరీక్షలు మాత్రం దసరా సెలవుల తరువాతనే జరుగుతాయని వారు తెలిపారు.  




Updated Date - 2022-09-18T05:06:37+05:30 IST