విద్యుత్ పొదుపు.. భవితకు భరోసా!
ABN , First Publish Date - 2022-12-15T00:47:53+05:30 IST
విద్యుత్ పొదుపు చేసి భావితరాలకు భరోసా కల్పించాలని, వినియోగంపై ప్రజల్లో మార్పు తీసుకువచ్చి ఇంధన పొదుపుతో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు.
గవర్నర్‌పేట, డిసెంబరు 14 : విద్యుత్ పొదుపు చేసి భావితరాలకు భరోసా కల్పించాలని, వినియోగంపై ప్రజల్లో మార్పు తీసుకువచ్చి ఇంధన పొదుపుతో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి బందరు రోడ్డు మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగింది. ఇంధన పొదుపు సామాజిక బాధ్యతగా స్వీకరిస్తామని, ఇంధన పొదుపు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు సమస్యలు లేకుండా చేయడంలో తమవంతు కృషి చేస్తామని విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇంధన పొదుపు ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. సమజ వనరులు ఇప్పటికే చాలా వరకూ అంతరించి పోతున్నాయని, వీటి వల్లే లభ్యమయ్యే విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ పొదుపు ద్వారానే భవిష్యత్తు తరాలకు వెలుగులు ఇవ్వగలమన్నారు. వినియోగంలో దుబారాను నివారించాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ఈ విషయంలో ఇంధన పరిరక్షణ మిషన్ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో జీఎండీ ఐ.పృధ్వీరాజ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జెఎండీ మాల్లారెడ్డి, ఏపీ ఈఆర్సీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు లక్ష్మీభీమేష్, విద్యుత్ ఎస్ఈ శిప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ ఈఈలు సుధాకర్, హనుమంతయ్య, ఏడీఈలు యు. శ్రీనివాస్, టి. శివరామకుమార్, ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి పాఠశాలలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని, నిధులున్నప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం విచారకరమని కలెక్టర్ దిల్లీరావు అన్నారు. మండల స్థాయిలో అభివృద్ధి పనుల ప్రగతిపై బుధవారం జేసీ, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్ధార్లు, పంచాయతీరాజ్, హౌసింగ్ ఈఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో లక్ష్యాలను సాధించాలన్నారు. జూనియర్ కళాశాలలో పనులకు అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెడ్‌క్రాస్ సంస్థలో సభ్యులను చేర్చడంలో మరింత కృషి పెట్టాలన్నారు. జిల్లాలోని 598 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేసి నివేదికలు అందజేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై..
గవర్నర్‌పేట : జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుని ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ అధ్యక్షుడు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి నుంచి జిల్లాలో 1421 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 379 మంది ప్రాణాలు కోల్పోయారని, 1274 మంది క్షతగాత్రులయ్యారన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రవాణా శాఖ రూపొందించిన రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడం మన అందరి బాధ్యత వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో డీటీసీ ఎం.పురేంద్ర, డీసీపీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసినీ, జిల్లా పంచాయతీ అధికారి జె.సునీత, ఆర్అండ్బీ ఎస్ఈ ఆర్. శ్రీనివాసమూర్తి, పోలీసు, రవాణా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
తండాల్లో కిడ్నీ వ్యాధి నివారణపై దృష్టి
ఆరోగ్యశాఖ కమిషనర్ నివాస్
కృష్ణలంక : ఎ.కొండూరు మండలం తండాలోని కిడ్నీ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివా్సకు వివరించారు. తండాలో కిడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇకపై చేపట్టవలసిన పనులపై బుధవారం కలెక్టర్ దిల్లీరావు, జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్, వైద్యాధికారులతో జె.నివాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో కిడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు. ఎ కొండూరు మండలంలో డయాలసిస్ సెంటర్ ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తిరువూరు ఆర్డీఓ ఎం.రవీంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.