సంక్రాంతి రిజర్వేషన్లు షురూ..

ABN , First Publish Date - 2022-12-15T00:37:37+05:30 IST

సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌ను ప్రారంభించింది.

సంక్రాంతి రిజర్వేషన్లు షురూ..

1,000 స్పెషల్‌ బస్సులు నడపాలని నిర్ణయం

జనవరి 1 నుంచి 18వ తేదీ వరకు స్పెషల్‌ ఆపరేషన్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌ను ప్రారంభించింది. షెడ్యూల్‌ బస్సులతో పాటు స్పెషల్‌ బస్సులకు కూడా ముందే రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. అధికారికంగా పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ మొత్తం 1,000 స్పెషల్‌ బస్సులు తిప్పుతామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం బుధవారం తెలిపారు. సంక్రాంతి ప్రయాణాల కోసం నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయటం లేదన్నారు. స్పెషల్‌ బస్సుల ఆపరేషన్‌ జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా కళాశాలలకు సెలవులు ప్రకటిస్తారు. విజయవాడలో చదువుకునే వందలాది మంది విద్యార్థులు రాయలసీమకు చెందినవారే. కళాశాలలకు అవుటింగ్‌ ఇచ్చే రోజుల్లో రాయలసీమకు పెద్దసంఖ్యలో బస్సులు నడిపే అంశంపై ఆర్టీసీ అధికారులు దృష్టిపెట్టారు. ఆయా రూట్లలో నడిపే ప్రత్యేక బస్సులకు కూడా ఆర్టీసీ అధికారులు ముందస్తుగా రిజర్వేషన్‌ అవకాశం కల్పించారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి విజయవాడకు వచ్చేవారి కోసం కూడా పెద్దసంఖ్యలో బస్సులు నడపటానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భద్రాచలం తదితర ప్రాంతాలకు కూడా డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ అధికారులు పీఎన్‌బీఎస్‌లో 24 గంటలు పనిచేసేలా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-15T00:37:38+05:30 IST