టెన్షన్..టెన్షన్..
ABN , First Publish Date - 2022-05-19T06:19:53+05:30 IST
టెన్షన్..టెన్షన్..

ఆర్డబ్ల్యూఎస్ అవినీతిపై రంగంలోకి ఏసీబీ
రక్షిత మంచినీటి పథకాల పనుల్లో అవినీతిపై ఆరా
ఎస్ఈతో ఫోన్లో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ
ప్రాథమిక విచారణ నివేదిక కోరిన అధికారులు
నేటి ఉదయం 11 గంటలకు ఇస్తామని అభ్యర్థన
అవినీతిపరులను తప్పించే కుట్ర
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగటంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అవినీతి అధికారులు, వారిని రక్షిస్తున్న ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. రక్షిత మంచినీటి పథకాల పేరుతో సాగించిన అవినీతిని కప్పిపుచ్చి బాధ్యులైన అధికారుల నుంచి దండిగా ఆమ్యామ్యాలు అందుకునేందుకు ఈఎన్సీ కార్యాలయం నుంచి విజయవాడ ఎస్ఈ కార్యాలయం వరకు తెరచాటు బేరాలు సాగించి ఇప్పటి వరకు కేసును తొక్కి పడుతూ వచ్చారు. నాలుగు రోజులు ఓపిక పడితే వ్యవహారం సద్దు మణిగిపోతుందని భావించిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ, జిల్లా అధికారులకు ఏసీబీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో, ఏసీబీ డీజీ నుంచి వచ్చిన సూచనలతో బుధవారం సాయంత్రం ఏసీబీ సీఐ నజీర్ నేతృత్వంలోని బృందం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నెక్కంటి సత్యనారాయణతో ఏసీబీ అధికారి మాట్లాడారు. ఏసీబీ డీఎస్పీకి ఫోన్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈతో మాట్లాడించారు. ఏసీబీ డీఎస్పీ ఏం మాట్లాడారన్నది తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఫోన్ సంభాషణల తర్వాత కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల గురించి ప్రస్తావించినట్టు తెలిసింది.
వరుస ప్రశ్నలు
ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి, రక్షిత మంచినీటి పథకంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, మంచినీటి పైపులైన్ల పనులు చేపట్టడంతో పాటు రికార్డులను ట్యాంపరింగ్ చేయటం వంటి వాటికి సంబంధించిన అనేక అంశాలపై విచారణ ఏం సాగించారు? దానికి సంబంధించిన నివేదికను అందజేయాల్సిందిగా కోరారు. ప్రాథమిక విచారణ మాత్రమే నిర్వహించామని, సమగ్ర విచారణ జరుగుతోందని అధికారులు జవాబిచ్చారు. ప్రాథమిక విచారణ కాపీని ఇవ్వాల్సిందిగా కోరటంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కంగుతిన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు అందిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారి చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ క్వాలిటీ కంట్రోల్ డీఈ హరమోహన్ను విచారించారు.
రూ.లక్షల్లో బేరం
బాధ్యులైన అధికారులను కాపాడేందుకు రూ.లక్షల్లో ఈఎన్సీ కార్యాలయం ఉన్నతాధికారులతో బేరాలు కుదిరాయని తెలుస్తోంది. విజయవాడ ఈఈ ఇప్పటికే రూ.2 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే తన సహచరులతో చెప్పుకోవటం కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. మొత్తం అవినీతి వ్యవహారాలన్నింటిపై కూడా ఏసీబీ కొద్దిరోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తోందని సమాచారం. ట్యాంపరింగ్ రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నాయని తెలిసింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసేందుకే ప్రాథమికంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రాథమిక నివేదిక మార్చేస్తారా?
అధికారుల తప్పుల కంటే కూడా వారిని కాపాడే విధంగా ప్రాథమిక నివేదికను రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి. ఈఎన్సీ కోరిక మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఈ పని చేశారని సమాచారం. ఏసీబీ అధికారులు ప్రాథమిక నివేదిక అడుగుతారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులెవరూ ఊహించలేదు. అధికారులను కాపాడేలా తయారు చేసిన ఈ నివేదికను ఏసీబీకి ఇస్తే తమ బాగోతం బయట పడుతుందన్న భావనలో ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈఎన్సీకి సమర్పించామన్న సాకుతో గురువారం ఇస్తామని అందుకే చెప్పారన్నది సమాచారం. ఈలోపు నివేదికను మార్చేసే ఆలోచనలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.