రక్తసిక్తం
ABN , First Publish Date - 2022-10-17T06:15:18+05:30 IST
రక్తసిక్తం
జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
నలుగురు యువకులు దుర్మరణం
జిల్లాలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మరణించారు. నందిగామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, విజయవాడలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో మరో ఇద్దరు అశువులు బాశారు.
హైదరాబాద్ వెళ్లి డబ్బు తీసుకొస్తుండగా..
విజయవాడ, ఆంధ్రజ్యోతి/నందిగామ రూరల్/సత్యనారాయణపురం, అక్టోబరు 16 : మండలంలోని అంబారుపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ నాగేశ్వరరెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన కొల్లి స్వామి లక్ష్మణకుమార్ (30), బొల్లినేని వెంకటేశ్వరరావు (24) స్వగ్రామం నుంచి బైకుపై హైదరాబాద్ వెళ్లారు. స్వామి లక్ష్మణకుమార్కు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం బంధువుల వద్ద రూ.4 లక్షలు తీసుకుని తిరిగి స్వగ్రామం బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున అంబారుపేట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణకుమార్కు భార్య, కుమారుడు ఉండగా వెంకటేశ్వరరావుకు వివాహం కాలేదు. సీఐ కనకారావు, ఎస్ఐ పండుదొరలు వివరాలు సేకరించి బంధువులకు సమాచారం ఇచ్చారు. నగదును జాగ్రత్త చేసిన ఏఎస్ఐ నాగేశ్వరరావును పలువురు అభినందించారు. సంఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొని..
రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో మృతిచెందాడు. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంబేకాలనీకి చెందిన ఎస్కే బాజీ (39) శనివారం అర్ధరాత్రి రైల్వేస్టేషన్ నుంచి మ్యాంగో మార్కెట్కు వెళ్లే దారిలో మీసాల రాజారావు వంతెన సమీపంలోని చాంద్ కల్యాణ మండపం వద్ద రోడ్డు దాటుతుండగా, ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాజీని ఆటోడ్రైవర్ 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే అతను మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఉపాధి కోసం ఊరు కాని ఊరొచ్చిన యువకుడు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు. బందరు రోడ్డులో ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పల్నాడు జిల్లా నరసింగపాడు గ్రామానికి చెందిన సింగంరెడ్డి శివారెడ్డి (24) ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివాడు. తొమ్మిది నెలల క్రితం విజయవాడకు ఉపాధి నిమిత్తం వచ్చాడు. శివారెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి గ్రామంలో కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. శివరెడ్డి మొగల్రాజపురంలోని హాస్టల్లో ఉంటూ ఎంజీ రోడ్డులో ఉన్న వెన్నెల క్లాత్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం షాపు నుంచి భోజనానికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి షాపునకు వస్తుండగా, బెంజిసర్కిల్ వైపు వెళ్తున్న ఏపీ39 ఎల్యూ 1106 ఆర్టీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో శివారెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
