భక్తి ప్రపత్తులతో పోలిస్వర్గం

ABN , First Publish Date - 2022-11-25T02:25:19+05:30 IST

కార్తీక మాసం ముగిసిన సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచి మచిలీపట్నం నాగులేరు వద్ద వేలాది మహిళలు పుణ్య స్నానాలు చేసి పోలెమ్మను స్వర్గానికి పంపారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నాగులేరులో వదిలి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నాగులేరులో వేలాది దీపాలు వేకు వజామున చీకటిని పారదోలాయి.

భక్తి ప్రపత్తులతో పోలిస్వర్గం

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 24 : కార్తీక మాసం ముగిసిన సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచి మచిలీపట్నం నాగులేరు వద్ద వేలాది మహిళలు పుణ్య స్నానాలు చేసి పోలెమ్మను స్వర్గానికి పంపారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నాగులేరులో వదిలి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నాగులేరులో వేలాది దీపాలు వేకు వజామున చీకటిని పారదోలాయి. మహిళలు సంప్రదాయ సిద్ధంగా ముత్తైదువులకు వాయనాలు ఇచ్చారు. పోలెమ్మ స్వర్గానికి వెళ్లే కథను చదివారు. పెద్దల నుంచి ఆశీర్వచనం పొందారు. నాగులేటి వద్ద రసలింగేశ్వరుని దర్శించుకున్నారు. రాబర్టుసన్‌ పేట రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో మహిళలు అరటి డొప్పలలో దీపాలను వదిలారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. మోపిదేవి : పవిత్ర కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలిని స్వర్గానికి పంపే కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది. పెదకళ్లేపల్లి, కె.కొత్తపాలెం, కొక్కిలిగడ్డ, కోసూరువారిపాలెం, మోపిదేవి వార్పు గ్రామాల్లోని కృష్ణానది తీరాల వద్ద తెల్లవారుజామునే మహిళలు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి వెళ్లిరావమ్మా....పోలి అంటూ సాగనంపారు. నాగాయలంక : వెళ్లి రా పోలిమ్మ.....స్వర్గానికి వెళ్లిరా అంటూ కార్తీక దీపాలను మహిళలు నదిలోకి వదిలారు. కార్తీక మాసమంతా దీపాలను వెలిగించిన భక్తులు గురువారం పాడ్యమి ఉదయాన్నే అరటి డొప్పలలో దీపాలను వెలిగించి పోలిని స్వర్గానికి పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగాయలంక శ్రీరామపాదక్షేత్ర పుష్కరఘాట్‌లో దీపాలను వెలిగించి నదిలోకి వదిలారు. అవనిగడ్డ రూరల్‌ : కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో పోయి రావమ్మా పోలి అంటూ మహిళలు వేకనూరు వద్ద గల కృష్ణానది వద్ద అరటి డొప్పలతో నదిలో దీపాలను వదిలి పోలెమ్మకు వీడ్కోలు పలికారు. గుడివాడ టౌన్‌ : అమావాస్య ముగింపు అనంతరం గురువారం తెల్లవారుజామున పెదకాలువ వద్ద మహిళలు, శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అరటి డొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి కాలువలో వదిలారు. పామర్రు : కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజున పోలిస్వర్గం వేడుకను నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఇది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలని బోధిస్తుందని అర్చకులు లంకా బీష్మకుమార్‌ పేర్కొన్నారు. కార్తీకమాసం ముగింపును కొండిప్రరు రోడ్డులో పుల్ల్లేటి రేవు వద్ద గురువారం పోలిని స్వర్గానికి పంపే వేడుకను మహిళలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పుల్లేటికాల్వలో స్నానాలు అచరించి, అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పోయిరావమ్మ పోలేమ్మ అంటూ నీటిలోకి వదిలారు.

Updated Date - 2022-11-25T02:25:19+05:30 IST

Read more