ప్లాట్‌ఫాంనే మార్చేశారు..!

ABN , First Publish Date - 2022-09-17T06:30:33+05:30 IST

ప్లాట్‌ఫాంనే మార్చేశారు..!

ప్లాట్‌ఫాంనే మార్చేశారు..!
క్యాంటీన్‌కు ఎదురుగా ఏర్పాటుచేసిన గుంటూరు ప్లాట్‌ఫాం, ప్రయాణికుల కుర్చీలు తొలగించిన ప్రాంతంక్యాంటీన్‌కు ఎదురుగా ఏర్పాటుచేసిన గుంటూరు ప్లాట్‌ఫాం, ప్రయాణికుల కుర్చీలు తొలగించిన ప్రాంతం

పీఎన్‌బీఎస్‌లో ఆర్టీసీ అధికారుల అడ్డగోలు అవినీతి

ప్రైవేట్‌ క్యాంటీన్‌కు ప్రయాణికులు వచ్చేందుకు తెరవెనుక చిత్రాలు

క్యాంటీన్‌ వద్దకు  గుంటూరు ప్లాట్‌ఫాం మార్పు 

ట్రాఫిక్‌ సమస్యల వల్లేనని బుకాయింపు 

ఈడీ లేని సమయంలో రహస్య ఆపరేషన్‌ 

క్యాంటీన్‌ నుంచి ఉన్నతాధికారికి ముడుపులు


ఇదో అవినీతి భోజన కార్యక్రమం. పీఎన్‌బీఎస్‌లోని అరైవల్‌ బ్లాక్‌లో ఓ క్యాంటీన్‌కు కస్టమర్లను తె చ్చి పెట్టేందుకు ఏకంగా ప్లాట్‌ఫాంలనే మార్చేసిన ఘనమైన వ్యవహారం. విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సెలవు పెట్టిన సమయాన్ని అదునుగా చూసుకుని అవినీతి అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టిన పన్నాగం. ఓ క్యాంటీన్‌కు ప్రయాణికులను రప్పించేందుకు డిపార్చర్‌ బ్లాక్‌లోని గుంటూరు నాన్‌స్టాప్‌ ప్లాట్‌ఫాంలను అరైవల్‌ బ్లాక్‌లోకి మార్చేశారు. అంతేకాదు.. క్యాంటీన్‌కు ఎదురుగా ప్రయాణికులు కూర్చునే సీట్లను తొలగించి ఖాళీ ప్రదేశాన్ని కల్పించారు. ఈ మొత్తం తంతులో ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరికి దండిగా కాసులు ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గుంటూరుకు చెందిన అన్ని రకాల బస్సు సర్వీసులు పీఎన్‌బీఎస్‌ డిపార్చర్‌ బ్లాక్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 11, 12, 13 నుంచి రాకపోకలు సాగించేవి. గుంటూరు నాన్‌స్టాప్‌, పల్లె వెలుగు బస్సుల కోసమంటూ వీటిని అరైవల్‌ బ్లాక్‌లోని 47, 48, 50 ప్లాట్‌ఫాంల్లోకి మార్చారు. బస్టాండ్‌లో ట్రాఫిక్‌ సమస్యలను నివారించడానికి, రద్దీని తొలగించడానికి ఈ పని చేసినట్టుగా కలరింగ్‌ ఇచ్చారు. వాస్తవానికి పీఎన్‌బీఎస్‌లో డిపార్చర్‌, అరైవల్‌ బ్లాక్స్‌ పక్కపక్కనే ఉంటాయి. డిపార్చర్‌ బ్లాక్‌లో ట్రాఫిక్‌ తగ్గించటానికే అనుకుంటే, అదే ట్రాఫిక్‌ అరైవల్‌ బ్లాక్‌లో కూడా ఉంటుంది. అది మరింత సమస్యాత్మకమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులన్నీ కూడా ఇన్‌గేట్‌ నుంచి అరైవల్‌ బ్లాక్‌ మీదుగానే రావాలి. ఇలాంటపుడు గుంటూరు ప్లాట్‌ ఫాంలు మార్చటం వల్ల ట్రాఫిక్‌ సమస్య తప్పనిసరిగా వస్తుంది. 

కాసుల వేటలో ఆర్టీసీ అధికారి

ఆర్టీసీ అధికారులు పైకి ఎన్ని కారణాలు చెప్పినా అంతర్గతంగా క్యాంటీన్‌ ప్రయోజనాల కోసమే ఇదంతా జరుగుతోందని అర్థమవుతుంది. క్యాంటీన్‌కు ప్రయాణికులను రప్పించడానికే ఇలా ప్లాట్‌ఫాంను ప్లాన్‌ చేసి మార్చారని తెలుస్తోంది. విజయవాడ ఈడీ సెలవులో ఉన్న సమయాన్ని చూసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గుంటూరు నాన్‌స్టాప్‌, పల్లె వెలుగు బస్సులు కిటకిటలాడుతూ అరైవల్‌ బ్లాక్‌కు వస్తుంటాయి. దీంతో క్యాంటీన్‌కు డిమాండ్‌ పెంచేయొచ్చన్నదే అసలు పన్నాగం. ఈ మొత్తం తంతులో ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరికి దండిగా కాసులు ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

క్యాంటీన్‌ కోసం ప్రయాణికుల సీట్లు తీసేశారు..

క్యాంటీన్‌ ప్రయోజనాల కోసం ప్రయాణికుల సీట్లను కూడా తీసేశారు. గుంటూరు నాన్‌స్టాప్‌ బస్సులకు కేటాయించిన ప్లాట్‌ఫాంల నుంచి క్యాంటీన్‌ వరకు కూడా రెండు వరసల్లో ఉన్న సీటింగ్‌ను సింగిల్‌ వరసకు కుదించారు. ఫలితంగా క్యాంటీన్‌ ఎదురుగా ఖాళీ స్థలాన్ని కల్పించారు. తద్వారా ప్రయాణికుల సర్క్యులేటింగ్‌ ఏరియా (ప్రయాణికులు గుంపులుగా ఉండేలా) సామర్థ్యాన్ని పెంచారు. ఇలా చేయటం వల్ల క్యాంటీన్‌కు చాలా ప్రయోజనముంటుంది.

పెంచాల్సింది పోయి.. కుదింపా..!

పీఎన్‌బీఎస్‌ అంటే ఆసియాలోనే రెండో అతి పెద్దది. రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఎన్‌బీఎస్‌ అరైవల్‌ బ్లాక్‌కు 4 వేల బస్సులు వస్తుంటాయి. 47 నుంచి 61 నెంబర్‌ వరకు మొత్తం 15 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణికులు దిగేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులను దింపిన బస్సులు డిపార్చర్‌ బ్లాక్‌కు వెళ్తుంటాయి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులకు ఈ 15 ప్లాట్‌ఫాంలు ఏమాత్రం చాలవు. ఇలాంటి సందర్భంలో ప్లాట్‌ఫాంలను పెంచాల్సింది పోయి కుదించేస్తున్నారు. 


అధికారులతో మాట్లాడి విచారణ చేస్తాం..

రెగ్యులర్‌ ఈడీ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జిగా ఉన్నాను. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ప్లాట్‌ఫాంలను మార్చాల్సి వచ్చిందని నాకు చెప్పారు. ప్లాట్‌ఫాంల మార్పు అనేది గతంలో అందరి అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని నాకు చెప్పారు. గుంటూరు వారు కూడా అంగీకరించారన్నారు. కాబట్టి అభ్యంతరం పెట్టలేదు. రెండో కోణం గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగిందో ఆర్టీసీ రీజనల్‌ అధికారులతో మాట్లాడతాను. విచారణ చేస్తాను. - రవికుమార్‌, ఇన్‌చార్జి ఈడీ, విజయవాడ జోన్‌ 




Updated Date - 2022-09-17T06:30:33+05:30 IST