పింగళి నడయాడిన నేల..
ABN , First Publish Date - 2022-08-17T06:57:41+05:30 IST
జాతీయపతాక రూపశిల్పి, బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య విగ్రహాన్ని పెదకళ్లేపల్లిలో ఆవిష్కరించటం గర్వించదగ్గ విషయమని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు.

పెదకళ్లేపల్లిలో విగ్రహావిష్కరణ
పింగళి వెంకయ్య పేరున పోస్టల్ కవర్
మోపిదేవి, ఆగస్టు 16 : జాతీయపతాక రూపశిల్పి, బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య విగ్రహాన్ని పెదకళ్లేపల్లిలో ఆవిష్కరించటం గర్వించదగ్గ విషయమని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. పింగళి ప్రాథమిక విద్యనభ్యసించిన పెదకళ్లేపల్లి గ్రామంలో ‘ప్రేమతో పెదకళ్లేపల్లి’ స్వచ్ఛంద సేవాసంస్థ, గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ పి.జాషువా, జేసీ మహేశ్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాట సమయంలోనే భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో గాంధీజీ సూచనల మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య అన్నారు. గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటు కేవలం అలంకారం కాదని, వారిని, వారి ఆశయాలను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. కేవలం జాతీయ పతాకాన్ని రూపొందించటమే కాకుండా అనేక రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తి పింగళి వెంకయ్య అని, వారి వంశస్థులు, కుటుంబసభ్యులు పెదకళ్లేపల్లిలో జీవనం సాగించటం ఈ ప్రాంత వాసులు గర్వించదగ్గ విషయమన్నారు. సంగీత, సాహిత్య కళలకు ప్రసిద్ధిగాంచి ఎంతోమందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దిన పెదకళ్లేపల్లి గ్రామస్థులు ప్రతీ ఒక్కరూ గర్వపడాలని శాసనసభ్యుడు సింహాద్రి రమేశ్‌బాబు తెలిపారు. పింగళి వంశస్థురాలు సుశీల దశరథ్రాంను అతిథులు దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. 75వ స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా పోస్టల్‌శాఖ పింగళి వెంకయ్య పేరున ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులు పింగళి వారసులకు అందజేశారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.గ్రామసర్పంచ్ అరజా సంధ్యారాణి, ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ మెడబలిమి మల్లిఖార్జునరావు, వైస్ ఎంపీపీ కడవకొల్లు సీతారామాంజనేయులు,ఎంపీటీసీ అరజా ఆశాదేవి, ప్రేమతో పెదకళ్లేపల్లి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గంధం వీరాంజనేయులు, విగ్రహ దాత లు పండలనేని శివప్రసాద్, గ్రామస్థులు పాల్గొన్నారు.
దుర్గానాగేశ్వరుని సన్నిధిలో ప్రముఖులు
మోపిదేవి: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకళ్లేపల్లిలోని దుర్గానాగేశ్వరుని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబులతో కలసి దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. సర్పంచ్ అరజా సంధ్యారాణి, ఆలయ పర్యవేక్షకులు పాల్గొన్నారు.