ఏడి..పింఛెన్
ABN , First Publish Date - 2022-07-29T06:26:36+05:30 IST
ఏడి..పింఛెన్
రెండు జిల్లాల్లో 200 మంది హెచ్‌ఐవీ బాధితుల పెన్షన్ కట్
మరికొందరివి తొలగించే ఛాన్స్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
- కృష్ణాజిల్లాకు చెందిన ఓ వ్యక్తి విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న ఏఆర్‌టీ సెంటర్ నుంచి హెచ్‌ఐవీ మందులు వినియోగిస్తున్నారు. ఆయనకు రెండేళ్లుగా న్యూట్రిషన్ కోసం ఇచ్చే పెన్షన్ వస్తోంది. మూడు నెలలుగా ఆగిపోయింది. ఎందుకు ఆగిందని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు.
- ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దివ్యాంగ మహిళ నాలుగేళ్లుగా హెచ్‌ఐవీ మందులు వినియోగిస్తున్నారు. అప్పటి నుంచే ఆమెకు న్యూట్రిషన్ కోసం ప్రభుత్వ పెన్షన్ వచ్చేది. కొంతకాలంగా ఆమెకు రావాల్సిన పెన్షన్ ఆగిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ఇప్పుడు హెచ్‌ఐవీ బాధితుల వద్దకు వచ్చింది. పెన్షన్‌ను ఠంచన్‌గా పెంచుతున్నామని చెబుతున్న ప్రభుత్వం తొలగింపు ప్రక్రియను సైతం నిరాటంకంగా సాగిస్తోంది. మన రెండు జిల్లాల్లో సుమారు 22 వేల మంది ఏఆర్‌టీ సెంటర్ల ద్వారా హెచ్‌ఐవీ మందులు వాడుతున్నారు. వీరిలో 3 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. హెచ్‌ఐవీ బారినపడిన వారు కొంచెం శక్తివంతమైన మందులు వాడాలి. ఇందుకు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం వీరికి ప్రభుత్వం నెలనెలా రూ.2,500 వరకు ఇస్తోంది. అలాంటి పెన్షన్‌ను ఆరంచెల ధ్రువీకరణ పేరుతో ఇప్పటికే 200 మందికి పైగా లబ్ధిదారులను తొలగించేసింది. మరికొంతమంది తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. వీరికి సాఽధారణ పెన్షన్ వచ్చినప్పటికీ పౌష్టికాహారం కోసం హెచ్‌ఐవీ పెన్షన్ కూడా అందించాలి. కానీ, ప్రస్తుతం సాధారణ, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్ వచ్చిన వారికి హెచ్‌ఐవీ పెన్షన్ ను నిలిపేశారు. కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిన వారినీ తొలగించినట్లు తెలిసింది.
అర్హులను గుర్తించడంలో జాప్యం
నిరుపేదలైన హెచ్‌ఐవీ బాధితులకు వారి అర్హతను బట్టి పెన్షన్ మంజూరు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కానీ, సిబ్బంది కొరతతో లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్ అందజేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో చాలామంది రోగులకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందడం లేదు. దీనివల్ల రోగులు సొంతంగానే పౌష్టికాహారాన్ని కొనుక్కుంటున్నారు. మరికొంత మంది ఖర్చును భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.