అయ్యయ్యో..!

ABN , First Publish Date - 2022-11-21T00:28:39+05:30 IST

అధికార పార్టీ ఎంపీటీసీ అహంభావం, జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు నీటి పాలయ్యాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికార పార్టీ నాయకుడి ఒత్తిడితో ఇరిగేషన్‌ సిబ్బంది పంట కాల్వకు నీటిని విడుదల చేయడంతో తెల్లారేసరికి రైతులకు చెందిన 50 ఎకరాలు నీట మునిగిపోయాయి. కోతకొచ్చిన వరి, మినుము చల్లి ఉన్న పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాటిని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అయ్యయ్యో..!

అర్ధరాత్రి పంట కాల్వగేట్ల ఎత్తివేత

నీటమునిగిన 50 ఎకరాలు

తడిసిన వరి కంకులు

అధికార పార్టీ ఎంపీటీసీ అహంభావం, జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు నీటి పాలయ్యాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికార పార్టీ నాయకుడి ఒత్తిడితో ఇరిగేషన్‌ సిబ్బంది పంట కాల్వకు నీటిని విడుదల చేయడంతో తెల్లారేసరికి రైతులకు చెందిన 50 ఎకరాలు నీట మునిగిపోయాయి. కోతకొచ్చిన వరి, మినుము చల్లి ఉన్న పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాటిని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గుడివాడ : నందివాడ మండలం జనార్ధనపురం శివారు నూతులపాడు గ్రామంలో ఇటీవల 10 ఎకరాల వరకు వరికోతలు పూర్తి చేశారు. మరో 40 ఎకరాల్లో రెండో పంటగా మినుము విత్తనాలను చల్లుకుని పొలంలో నీరు లేకుండా కోతకు సిద్ధమయ్యారు. నూతులపాడు గ్రామానికి ఆనుకుని తనకున్న పొలంలో నీరు లేకపోవడంతో అఽధికార పార్టీ ఎంపీటీసీ జలవనరుల శాఖ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి కాలువకు నీటిని విడుదల చేయించారు. దీంతో కాలువ వెంబడి కోత కోసి పనలపై ఉన్న వరి, కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నీటమునిగాయి. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతులు చేతికొచ్చిన పంట నీటి పాలవ్వడాన్ని గమనించి కన్నీరుమున్నీరయ్యారు. కోతకు మహిళా కూలీలు సైతం పొలం వద్దకు చేరుకున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటమునగడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో పంటగా వేసిన మినుము కూడా పనికిరాకుండా పోయింది. పంటను రక్షించుకునేందుకు రైతులు మోటార్లను పెట్టి నీటిని బయటకు తోడుతూ నష్టనివారణ చర్యలకు దిగారు.

ఇరిగేషన్‌ అధికారులే

బాధ్యత వహించాలి

పంటకు అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసేందుకు తాత్సారం చేసే ఇరిగేషన్‌ అధికారులు నేడు అధికార పార్టీ ఎంపీటీసీ అడిగితే అవసరం లేకున్నా ఏకంగా కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడం దారుణమని రైతులు వాపోతున్నారు. తడిసిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారులే బాధ్యత వహించాలి

అధికార పార్టీ నాయకులకు అధికారులు తొత్తులుగా వ్యవహరించడం దారుణం. రైతులకు జరిగిన నష్టాన్ని ఇరిగేషన్‌ అధికారులే భరించాలి. పంట నష్టానికి కారకులైన అధికార పార్టీ ఎంపీటీసీ, ఇరిగేషన్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నీటమునిగిన పంటను ప్రభుత్వమే ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని మినుము విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి.

- రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

Updated Date - 2022-11-21T00:28:40+05:30 IST