కల‘వరి’ంత!
ABN , First Publish Date - 2022-11-02T23:56:25+05:30 IST
జిల్లాలో వరి పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ తరుణంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురు పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన పొలాల్లో పైరు పొట్టదశలో ఉండి ఈతకు సిద్ధంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో ముందస్తుగా వేసిన భూముల్లోని వరి పంట ఈనిన కంకులు పాలుపోసుకుని కోతకు సిద్ధంగా ఉన్నాయి.
వాతావరణ మార్పులతో రైతుల్లో భయాందోళన
రోజుల తరబడి ముసురుతో వరికి తెగుళ్ల బెడద
కంకులు పాలుపోసుకు నేదశలో వర్షం పడితే ఇక్కట్లే
జిల్లాలో వరి పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ తరుణంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురు పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన పొలాల్లో పైరు పొట్టదశలో ఉండి ఈతకు సిద్ధంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో ముందస్తుగా వేసిన భూముల్లోని వరి పంట ఈనిన కంకులు పాలుపోసుకుని కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో వరి కోతలు ప్రారంభమవుతాయని అధికారుల అంచనాగా ఉంది. ఈ దశలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, వర్షం కురుస్తుండటంతో రైతుల్లో వణుకు ప్రారంభమైంది. వ ర్షం కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలిపోతుందని, దీంతో దిగుబడులు తగ్గుతాయనే భయం రైతులను వెంటాడుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 1.71 లక్షల హెక్టార్లలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరిసాగైంది. నాలుగు రోజులుగా ముసురు పట్టింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వరి పైరుకు పచ్చపురుగు, ఆకుముడత, ఆగ్గి తెగులు వ్యాపిస్తున్నాయి. ఆకుముడ త తాకిడి అధికమైతే పాలుపోసుకునే దశలో ఉన్న వరి కంకులను పురుగు కొట్టివేస్తుందని, దిగుబడులు తగ్గుతాయని రైతులు భయపడుతున్నారు. కంకులు ఈని పాలుపోసుకునే దశలో వర్షాలు కురిస్తే అధిక సమయం కంకులు వాన నీటిలో తడచి ఉండటంతోపాటు మంచు ప్రభావంతో కంకులకు మానుగాయ వస్తుందని రైతులు చెబుతున్నారు. నవంబరు నెల కావడంతో తుపానుల భయం రైతులను వెంటాడుతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షంతో పాటు బలమైన గాలులువీస్తే పాలుపోసుకునే దశలో ఉన్న గింజలు పగిలిపోయి తప్ప, తాలుగా మారిపోతాయని రైతులు చెబుతున్నారు. బీపీటీ 5204 వంటి వరి రకం ధాన్యం రెండు రోజులకు మించి వర్షపునీటిలో తడిస్తే గింజ నానిపోయి బియ్యంలో నాణ్యత దెబ్బతింటుందని రైతులు అంటున్నారు. ఈ నెలలో వర్షం కురవకుంటే వరికోతలకు ఇబ్బంది ఉండదని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిస్తే వరికోతలు ఆలస్యమవుతాయని, ఈ ప్రభావం రబీ సీజన్‌లో సాగు చేసే మినుముపై పడుతుందని రైతులు అంటున్నారు.
5 నాటికి పంట నష్టం తుది అంచనాలు
గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం మండలాల్లోని వరిపైరు రోజుల తరబడి నీటమునిగి చనిపోయింది. డ్రెయిన్‌లు పొంగి పొర్లడంతో సముద్రంలోకి మురుగునీరు త్వరితగతిన పోలేదు. దీంతో వరిపంట దుబ్బు చేసే దశలోనే చనిపోయింది. మచిలీపట్నం, బాపులపాడు మండలాల్లో సాగుచేసిన వేరుశెనగ పంట 70 రోజుల వ్యవధిలో ఉన్నది కొంత, 30 రోజుల వ్యవధిలో ఉన్నది కొంత నీటిలో మునిగి దెబ్బతింది. కృష్ణానదికి వరదలు వచ్చిన కారణం తోట్లవల్లూరు, చల్లపల్లి, మొవ్వ, ఘంటసాల, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని లంకభూముల్లో సాగుచేసిన కంద, పసుపు, మిరప, పూలతోటలు, తమలపాకుతోటలు దెబ్బతిన్నాయి. గత నెలలోనే జిల్లాలో 25 గ్రామాల పరిధిలో 2,500 హె క్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఈనెల 5వ తేదీ నాటికి జిల్లాలో దెబ్బతిన్న పంటల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, కృష్ణానదికి వరదల కారణంగా 33 శాతంకన్నా అధికంగా పంటలు దెబ్బతింటేనే పంటన ష్టం జరిగినట్లుగా నమోదు చేయడం జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న పంటల వివరాలు ఈ-క్రాప్‌లో సక్రమంగా నమోదు చేసి రైతులకు పంట నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.