-
-
Home » Andhra Pradesh » Krishna » New District Collectorate in Gollapudi-NGTS-AndhraPradesh
-
కొత్త జిల్లా కలెక్టరేట్ గొల్లపూడిలో..
ABN , First Publish Date - 2022-02-19T06:28:43+05:30 IST
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కలెక్టరేట్ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఏర్పాటు కానుంది.

పరిశీలనలో దేవదాయశాఖ భవనం
జిల్లాస్థాయి కార్యాలయాల కోసమూ అన్వేషణ
కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో భవనాల గుర్తింపు
విజయవాడ రూరల్, ఫిబ్రవరి 18 : కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కలెక్టరేట్ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఏర్పాటు కానుంది. కలెక్టరేట్‌తోపాటు అన్ని జిల్లాస్థాయి కార్యాలయాలనూ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు అనువైన భవనాల కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఉన్న భవనం కలెక్టరేట్‌కు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టరేట్‌తోపాటు కీలకమైన జిల్లాస్థాయి కార్యాలయాలను అందులో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అలాగే జిల్లాస్థాయి కార్యాలయాల కోసం గొల్లపూడి వై జంక్షన్‌లో ఉన్న టీటీడీసీ, డ్వామా కార్యాలయ భవనాలను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు గొల్లపూడి అనువుగా ఉండటంతోపాటు, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉండదనే ఉద్దేశంతోనే కలెక్టరేట్‌ను అక్కడ ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం గొల్లపూడిలోని దేవదాయ, ధర్మదాయ కమిషనరేట్ భవనంతోపాటు టీటీడీసీ, డ్వామా భవనాలను రెండు రోజులపాటు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ భవనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని
కలెక్టర్ యోచిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడే జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు ప్రాంతాలకు గొల్లపూడి దగ్గరగా ఉండటంతో ఈ గ్రామానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి తరహాలో గొల్లపూడి శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, బైపాస్ రోడ్డు కూడా ఉండటంతో అన్ని రకాలుగా ఇది కలెక్టరేట్ అనువుగా ఉంటుందని కలెక్టర్ నివాస్ భావిస్తున్నారు.