భక్తిశ్రద్ధలతో నాగులచవితి
ABN , First Publish Date - 2022-10-30T00:24:57+05:30 IST
పట్టణంలో నాగుల చవితి సందర్భంగా నాగలింగేశ్వరస్వామి, నాగలక్ష్మి అమ్మవారు, మార్కండేయస్వామి దేవస్థానాల్లో ఉన్న పుట్టల వద్ద భక్తులు పోటెత్తారు.
జగ్గయ్యపేట, అక్టోబరు 29: పట్టణంలో నాగుల చవితి సందర్భంగా నాగలింగేశ్వరస్వామి, నాగలక్ష్మి అమ్మవారు, మార్కండేయస్వామి దేవస్థానాల్లో ఉన్న పుట్టల వద్ద భక్తులు పోటెత్తారు. పాలుపోసి పూజలు నిర్వహించారు. విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలాభాను, విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యలు ప్రత్యేక పూజలు చేశారు. బలుసుపాడు గురుథామ్‌లో తాత్వికులు గెంటేల వెంకట రమణ దంపతులు పాలు పోసి పూజలు చేశారు. రామాపురం క్రాస్‌రోడ్డు నల్లబండగూడెం పుట్ట వద్ద రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్న సమారాధన నిర్వహించారు.
జి.కొండూరు, రెడ్డిగూడెం: నాగుల చవితిని భక్తులు భక్తిశ్రద్ధలతో శనివారం జరుపుకున్నారు. జి.కొండూరులోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న నాగేంద్రస్వామి పుట్టలో, నాగేంద్రస్వామి ఆలయంలో పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ భక్తులకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ చైర్మన్ లంకోతు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం మండలం రాఘవాపురం పెద్దమ్మతల్లి ఆలయంలో పుట్టలో పాలు పోసేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సమీపంలోని పొలాల్లో ఉన్న పుట్టల్లో భక్తులు నాగేంద్రస్వామికి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.