అన్నా.. అని పిలిచి.. కత్తితో పొడిచాడు..
ABN , First Publish Date - 2022-10-17T06:16:30+05:30 IST
అన్నా.. అని పిలిచి.. కత్తితో పొడిచాడు..
కంచికచర్లలో దారుణ హత్య
కంచికచర్ల రూరల్, అక్టోబరు 16 : ఆదివారం రాత్రి 11 గంటలు.. ఓ వ్యక్తి ఇంటి ముందుకొచ్చి అన్నా.. అని పిలిచాడు. తెలిసిన వ్యక్తే.. పైగా తమ గ్రామానికి చెందినవాడేననే చనువుతో లోపలున్న మరో వ్యక్తి బయటకొచ్చాడు. చనువుగా ఏంటి తమ్ముడు అనేలోపే.. బయట నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా గుండెలోకి కత్తిని దింపాడు. అసలేం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకునేలోపే లోపలి నుంచి వచ్చిన వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. సినీ ఫక్కీలో క్షణాల్లో జరిగిపోయిన ఈ హత్య కంచికచర్లలో ఆదివారం రాత్రి సంచలనం సృష్టించింది. స్థానిక గొట్టిముక్కల రోడ్డులో నివాసం ఉంటున్న చల్లకంటి నాగరాజు(35)ను అదే గ్రామానికి చెందిన జోజి అనే యువకుడు ఇలా కత్తిని గుండెలో దింపి చంపాడు. ఇంటి వద్దకు వచ్చి నాగరాజును పిలవడంతో.. రోజూ ఇంటికి వస్తున్న అతనే కదా.. అని బయటకు వచ్చి పలకరించాడు. ఒక్కసారిగా దాడి జరగడంతో నిర్ఘాంతపోయి ప్రాణాలు వదిలాడు. అనంతరం జోజి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్సై సుబ్రహ్మణ్యం సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు దారితీసిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.