జగమొండిని ఎదుర్కొందాం..

ABN , First Publish Date - 2022-03-05T06:02:02+05:30 IST

జగమొండిని ఎదుర్కొందాం..

జగమొండిని ఎదుర్కొందాం..
నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మెల్సీలు

ఒకరోజు నిరాహారదీక్షలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల పిలుపు

ఉపాధ్యాయులు, సంఘాలకు దిశానిర్దేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘చరిత్రలో ఇంతకంటే పెద్ద అణచివేతలనే చూశాం. జేఏసీల ఉద్యమానికి మీరే వెన్నెముకలు. ఉద్యమం విఫలమైందన్న భావన రానీయొద్దు. నూతన విద్యావిధానం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఉపాధ్యాయ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సుదీర్ఘ పోరాటాలే పరమావధి కావాలి. మొండి, మొరటు ప్రభుత్వంతో ఢీ కొనాలంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యతతో ఉద్యమపథంలోకి దిగాలి. మీ వెంట మేముంటాం. శాసన మండలిలో మా వంతు కృషి చేస్తాం.’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సంఘాలకు దిశానిర్దేశం చేశారు. జస్టిస్‌ ఫర్‌ పీఆర్సీ ఫోరం ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్‌లో శుక్రవారం పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏడుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు పాల్గొని ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు. ఉపాధ్యాయ నేతలను కార్యోన్ముఖులను చేశారు.

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల దిశానిర్దేశం

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ప్రభుత్వ తీరు చూస్తే దాడి చేసేలాగే ఉంది. దెబ్బలు తప్పవు. సిద్ధంగా ఉండాలి. సీపీఎస్‌ రద్దు అంశం రాబోతోంది. రాజస్థాన్‌లో ఇప్పటికే సీపీఎస్‌ను రద్దు చేశారు. చత్తీస్‌గడ్‌ , కేరళలో కూడా రద్దుచేసే పరిస్థితి ఉంది. మీ పోరాటాలకు సీఎం జగన్‌ కూడా దిగి రాక తప్పదు.’ అని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్‌ చొరవ చూపాలని, మొండిగా ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో నష్టపోతారని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యమానికి తాము అండగా ఉంటామని, సుదీర్ఘ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మరో ఎమ్మెల్సీ వై.వెంకటేశ్వర్లు (వైవీ) మాట్లాడుతూ ‘వైసీపీ ప్రభుత్వం సినీనటులతో మాట్లాడుతుంది కానీ, 13 లక్షల మంది ఉద్యోగులతో మాట్లాడదు. ఈ ప్రభుత్వ స్వభావమేమిటో మీకు తెలిసింది కదా. ఇలాంటి జగమొండి ప్రభుత్వంతో సుదీర్ఘ ఉద్యమాలే శరణ్యం. తెగబడి పోరాడి తే కానీ సమస్యలు పరిష్కారం కావు.’ అని పేర్కొన్నారు. ఇంకో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని, హామీలను అమలు చేయాలని అడుగుతుంటే అణచివేయాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని, సీపీఎస్‌ను ఏకపక్షంగా రద్దు చేయాలని సూచించారు. పీఆర్సీ విషయంలోనూ హైకోర్టు మొట్టికాయ తప్పదని ఆయన హెచ్చరించారు. మరో ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో చాలా లోపాలు ఉన్నాయని, ఈ అంశాలపై కూడా దృష్టి పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు. పోరాటాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంకో ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఒక్కో జిల్లాకు నలుగురైదుగురు జేసీలు ఉన్నారని, వారు పాఠశాలలను సందర్శించలేక పోతున్నారని పాఠశాలలను తగ్గిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ మాట్లాడుతూ ‘ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉండాలి. ప్రభుత్వంపై ముప్పేట ఒత్తిడి తేవాలి. ఉద్యమాలు సాగాలి. ఉద్యమం ఆగిందని ప్రభుత్వం అనుకుంటోంది. ఇవే మహా పోరాటాలకు పునాది అని మరిచిపోవద్దు.’ అని పేర్కొన్నారు.




Updated Date - 2022-03-05T06:02:02+05:30 IST