సెంట్రల్‌లో పీకే కాక!

ABN , First Publish Date - 2022-10-11T05:52:30+05:30 IST

విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పీకే టీం గత 6 నెలలుగా సర్వే నిర్వహిస్తోంది.

సెంట్రల్‌లో పీకే కాక!

నియోజకవర్గంలో 6 నెలలుగా పీకే టీం సర్వే

సొంత పార్టీలోనే విష్ణుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి

 సెంట్రల్‌లో వైసీపీకి 16 మంది కార్పొరేటర్లు

 వారిలో 14 మంది విష్ణుకి వ్యతిరేకమే

 డివిజన్‌ ఇన్‌చార్జులదీ అదే బాట

 నియోజకవర్గ నేతలతో తాడేపల్లి పెద్దల మంతనాలు

 విష్ణుకి పనిచేసే ప్రసక్తే లేదన్న నియోజకవర్గ నేతలు

 టికెట్‌ రేసులో గౌతంరెడ్డి, రుహుల్లా, అవుతు శైలజారెడ్డి

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పీకే టీఎం సర్వే కలకలం రేపుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నియోజకవర్గంలో ఏ మాత్రం సానుకూల వాతావరణం లేదని పీకే టీం వైసీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా వారం రోజుల క్రితం తాడేపల్లి పెద్దలు సెంట్రల్‌ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. వారి నుంచీ విష్ణుపై ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఈసారి సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కొత్తవారు బరిలో నిలవడం దాదాపు ఖాయమని వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. 

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పీకే టీం గత 6 నెలలుగా సర్వే నిర్వహిస్తోంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పీకే టీం సర్వేలో సిట్టింగ్‌ అభ్యర్థి మల్లాది విష్ణుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం పీకే టీం సమగ్ర నివేదిను వైసీపీ పెద్దలకు అందించింది. ఈ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వారం రోజుల క్రితం తాడేపల్లి పెద్దలు సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన 16 మంది వైసీపీ కార్పొరేటర్లను, మిగిలిన 5 డివిజన్ల ఇన్‌చార్జులను పిలిపించి మాట్లాడారు. 16 మంది కార్పొరేటర్లలో 14 మంది విష్ణుపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసినట్లు సమాచారం. డివిజన్‌ ఇన్‌చార్జులు ఐదుగురూ విష్ణుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణుకు ఈసారి సీటు ఇచ్చేపక్షంలో తాము ఆయనకు పనిచేయబోమని వారు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో భారీగా ఖర్చుపెట్టామని, ఆ డబ్బు రాబట్టుకునేందుకు తమకు ఎమ్మెల్యే అడ్డంకిగా మారారని వారు వాపోయినట్లు తెలిసింది. అన్నింటిలోనూ ఎమ్మెల్యే జోక్యంతో కార్పొరేటర్లు డమ్మీలుగా మారిపోయారని, చివరికి చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి నెలకొందని వారు తాడేపల్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 

 ఇదే చివరి అవకాశంగా ఎమ్మెల్యే మల్లాది

మల్లాది విష్ణు సైతం తనకు ఇదే చివరి అవకాశం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బార్ల వేలంపాటలో ఆయన కుటుంబ సభ్యులు రెండు బార్లు సొంతం చేసుకున్నారు. విష్ణు అనుచరులు బుడమేరును కాసుల వర్షం కురిపించే వనరుగా మార్చుకున్నారు. పార్కులను కబ్జా పెడుతున్నారు. మూడేళ్ల కాలంలో  వసూళ్ల దందాలు వంటి ఆరోపణలు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన దృష్టి సారించింది లేదు. ఇటీవల సూర్యలంక బీచ్‌లో చనిపోయిన ఆరుగురు యువకులు సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన వారే. వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇప్పించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేసినా ఎమ్మెల్యే స్పందించలేదు.  

 మేమే పోటీ చేస్తాం : కార్పొరేటర్లు 

తమకు అవకాశం కల్పిస్తే సెంట్రల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తామని ఇద్దరు కార్పొరేటర్లు తాడేపల్లి పెద్దలకు విన్నవించుకున్నట్లు సమాచారం. ఆర్థికంగా తమకు పార్టీ నుంచి పెద్దగా మద్దతు అవసరం లేదని, టికెట్‌ ఇస్తే చాలని వారు పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు సెంట్రల్‌ టికెట్‌ రేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ రుహుల్లా, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి కూడా ఉన్నారని ఆ నేతల అనుచరులు చెబుతున్నారు. 

అయితే వైసీపీ అధిష్ఠానం మాత్రం ఈసారి సెంట్రల్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి కానీ లేదా బీసీలకు కానీ సెంట్రల్‌ టికెట్‌ ఇచ్చే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి గత ఎన్నికల్లో సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా వైసీపీ తరఫున బరిలో నిలవాల్సి ఉంది. కానీ ఎన్నికల ముందు చక్రం తిప్పిన విష్ణు ఆయనకు టికెట్‌ దక్కకుండా చేయగలిగారు. దీని ప్రభావంతో గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు వైసీపీకి దూరమయ్యారు. ఈసారి వారిని పార్టీ వైపు మళ్లించుకునే ఎత్తుగడలో భాగంగా కాపు సామాజికవర్గానికి టికెట్‌ ఇవ్వొచ్చన్న ప్రచారం ఉంది. అదే సమయంలో బీసీ కార్డుతో సరికొత్త ప్రయోగానికీ తెరదీస్తారన్న ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-10-11T05:52:30+05:30 IST