కొంచెం ఇష్టం.. చాలా కష్టం..

ABN , First Publish Date - 2022-12-31T01:05:16+05:30 IST

గతమెప్పుడూ జ్ఞాపక పుటల్లో భద్రంగానే ఉంటుంది. కాకపోతే బరువైనవి, బాధాకరమైనవి, చేదైనవి పదేపదే గుర్తొస్తూ ఉంటాయి. ఎంత మరిచిపోదామనుకున్నా మరపురాకుండా మనసును మెలివే స్తుంటాయి. ఈ లోటును గతంలో కరోనా భర్తీ చేసేది. గడిచిపోతున్న ఈ వత్సరంలో మాత్రం అంతకు మించిన దుస్సంఘటనలే జిల్లాను చుట్టుము ట్టాయి. అత్యాచారాలు.. అఘాయి త్యాలు.. అక్రమాలు.. హత్యలకే 2022లో చాలా సమయం గడిచిపోయింది. ఆ వివరాలను ఒకసారి పరికిస్తే.. - (విజయవాడ-ఆంధ్రజ్యోతి)

కొంచెం ఇష్టం.. చాలా కష్టం..
డిసెంబరులో కృష్ణానదిలో మునిగి ఐదుగురు మృతి

అన్నింట్లోనూ బాదుడే..

ఈ ఏడాదీ సామాన్యుడిపై ధరల మోత మోగింది. నిత్యావసరాలు మొదలు గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌ వంటివన్నీ గతంలో ఎన్నడూ పెరగని రీతిలో శరవేగంగా పెరిగిపోయాయి. ఇళ్లపై చెత్త పన్ను భారం మోపడమే కాకుండా, ఇంటి పన్నులనూ ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రెండు జిల్లాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలో జరిగిన బాదుడే బాదుడు నిరసనలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

కన్నీటి కృష్ణా

జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన దీపావళి బాణాసంచా దుకాణాల్లో పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందారు. కృష్ణానదిలో మునిగి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. బాపట్ల బీచ్‌లో సరదాగా స్నానానికి వెళ్లి సింగ్‌నగర్‌కు చెందిన ఆరుగురు యువకులు మృతిచెందడం జిల్లాను శోకసంద్రంలో ముంచెత్తింది.

మట్టి కొట్టేశారు..

ఆదాయ మార్గాల్లేక అధికార పార్టీ నాయకులు జిల్లావ్యాప్తంగా మట్టి దోపిడీకి తెరలేపారు. మట్టినే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఎవరైనా మట్టి తవ్వకాలకు అడ్డుప డితే ప్రభుత్వ ఉద్యోగులు అని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారు.ఈ ఏడాది మార్చిలో కృష్ణలంక పోలీసుస్టేషన్‌పై బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ దాడి చేశారు. తన మేనల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న కారణంతో తన అనుచరులతో దాడులకు తెగబడ్డారు.

హత్యాచారాలు బాబోయ్‌..

అత్యాచారాలు.. హత్యలు.. దాడుల పరంగానే ఉమ్మడి కృష్ణాజిల్లా పేరు మార్మోగింది. గుడివాడలో నిర్వహించిన కేసినో కూడా పెద్ద సంచలనమే అయ్యింది. పేదలకు వైద్యసేవలందించాల్సిన కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని ఓ యువతిని గదిలో బంధించి రెండు రోజుల పాటు ముగ్గురు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంతో బెజవాడ నగరమే కాదు రాష్ట్రమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో ఈ ఉదంతం తేటతెల్లం చేసింది. ఫిబ్రవరిలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు మల్లారెడ్డిని రాజకీయ కక్షలతో అధికార పార్టీ నాయకులు హత్య చేయించారు. సెప్టెంబరు మూడో తేదీన విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఓ కన్ను పోగొట్టుకున్నారు. నవంబరు 28నమల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ సంకల్పసిద్ధి సంస్థ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మొత్తం రూ.150 కోట్ల స్కాంలో ఐదుగురిని అరెస్టు చేశారు.

కాస్త మోదం

  • ఉమ్మడి కృష్ణా జిల్లా రెండుగా ఆవిర్భవించింది ఈ ఏడాదిలోనే. జనవరిలో కొత్త జిల్లాల ప్రకటన వెలువడగా ఏప్రిల్‌లో వాటిని అమల్లోకి తెచ్చారు. ఉమ్మడి జిల్లాతో చిరకాల అనుబంధం ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. ఏడేసి నియోజకవర్గాలతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు ఆవిర్భవించాయి.

  • విజయవాడకు తూర్పు బైపాస్‌ ప్రకటన, మచిలీపట్నం పోర్టుకు మరోసారి శంకుస్థాపనకు సన్నాహాలు, విజయవాడ పశ్చిమాన కృష్ణానదిపై ఆరు వరుసల వంతెన నిర్మాణం, విజయవాడ-మచిలీపట్నం రహదారిని నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లగా విస్తరిస్తారన్న ప్రకటనలు ఉమ్మడి కృష్ణా జిల్లావాసులకు కాస్త ఊరట కలిగించాయి.

  • 2019 తర్వాత పూర్తిగా చతికలపడిన రియల్‌ రంగం కొత్త జోష్‌ పుంజుకుంటోంది. 2019కి ముందు విజయవాడ నగరం నలువైపులా విస్తరిస్తూ రియల్‌ రంగం పరుగులు తీసింది. 2019 ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో ఈ రంగం చతికిలపడింది. విజయవాడకు తూర్పున బైపాస్‌కు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

వివాదాలు

  • సెప్టెంబరు 21నఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరును వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీగా మార్చారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

విశేషాలు

  • అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగాయి.

  • డిసెంబరు 23, 24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించారు.

విషాదాలు

  • ప్రముఖ నటులు, కృష్ణాజిల్లాకు చెందిన కైకాల సత్యనారాయణ, చలపతిరావు కాలం చేశారు.

Updated Date - 2022-12-31T01:05:26+05:30 IST