కొత్త బార్ లైసెన్స్ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-02-12T06:29:17+05:30 IST
కొత్త బార్ లైసెన్స్ రద్దు చేయాలి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 11: కొండపల్లిలో కొత్త బార్ లైసెన్స్ రద్దు చేయాలని టీడీపీ వార్డు కౌన్సిలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై శాంతినగర్ సమీపంలో వైసీపీ నేతలు కొత్త బార్‌ను తెరిచేందుకు సన్నాహాలు చేయ డాన్ని నిరసిస్తూ శుక్రవారం టీడీపీ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బార్ తెరిచే ప్రాంగణం వద్ద వార్డు కౌన్సిలర్లు మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చివేశారని విమర్శించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పారిశ్రామికవేత్తనని యువతకు ఉపాధి కోసం కంపెనీలు తీసుకువస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు కొత్త బార్లను తెచ్చి యువతను మద్యం మత్తులో ముంచే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. కొండపల్లి పురపాలక సంఘంలో గెలిచిన వార్డు కౌన్సిలర్లను సంప్రదించకుండా కమిషనర్ నిర్మాణాలకు ఏకపక్షంగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బార్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు పోరాటాం చేస్తామని హెచ్చరించారు. తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చుట్టుకుదురు వాసు, పార్టీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు చెన్నుబోయిన చిట్టిబాబు, కరిమికొండ శ్రీలక్ష్మి, ధరణికోట విజయలక్ష్మి, పులి అరుణకుమారి, ముప్పసాని భూలక్ష్మి, రావి ఫణి, ఎండీ అప్సర్, భయ్యా రాము, కొత్తపల్లి ప్రకాశ్, గౌరా శ్రీనివాసరావు, ఎర్ర శ్రీను పాల్గొన్నారు.