కళావిహీనం

ABN , First Publish Date - 2022-02-23T06:22:23+05:30 IST

కబ్జాలకు కాదేదీ అనర్హమన్నట్టుంది కొందరు అక్రమార్కుల తీరు.

కళావిహీనం


  కబ్జాకోరల్లో సాహిత్య దీప్తి

  రూ.కోట్ల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తుల పాగా

  రాజకీయ అండదండలే కారణమని విమర్శలు

  కోర్టు ఆదేశాలను అమలు చేయని రెవెన్యూ అధికారులు

 కబ్జాలకు కాదేదీ అనర్హమన్నట్టుంది కొందరు అక్రమార్కుల తీరు. ఖాళీ స్థలం కనిపిస్తేచాలు చటుక్కున వాలిపోతారు. నిర్మాణాలు చేపట్టి సొంత భూమి అన్నట్టు అంతా చక్కబెట్టుకుంటారు. అటువంటిదే పట్టణంలోనూ చోటుచేసుకుంది. ఒకనాడు సాహిత్యం, కళలకు వేదికగా నిలిచిన కవిరాజ కళామందిరం రెండు దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకుని కళా విహీనమైంది. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పులున్నా అధికారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

ఆంధ్రజ్యోతి, గుడివాడ : ఏడు దశాబ్దాల క్రితం పట్టణ నడిబొడ్డులో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారకార్థం ప్రభుత్వ భూమిలో కళామందిరం ఏర్పాటు చేశారు. ‘కవిరాజ సాహిత్య విహారం’ పేరిట కొందరు పెద్దలు కమిటీగా ఏర్పడి కళామందిరం బాధ్యతలు చూసేవారు. కాలక్రమంలో వారందరూ చనిపోవడంతో కవిరాజు వారసుల పేరిట మరికొందరు రంగప్రవేశం చేశారు. కళామందిరంపై పట్టు బిగించి ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. కళామందిరం ప్రాంగణంలోనే నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ద్వితీయ శ్రేణి శాఖా గ్రంథాలయం కబ్జాదారుల దెబ్బకు 2012లో మూతపడింది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ కబ్జాపర్వం 2008 నాటికి పతాకస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కవిరాజ కళామందిరం వెనక ప్రాంతంలో ఓ హోటల్‌ కూడా వెలిసింది. రకరకాల దుకాణాలు కళామందిరం చుట్టూ ఉన్న స్థలంలో పుట్టుకొచ్చాయి. అద్దెలు మాత్రం రాజకీయ నాయకుల అండదండలతో వారసులుగా చెలామణీ అవుతున్న వారే వసూలు చేసుకుంటున్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుడివాడ విచ్చేసిన కవిరాజ వారసులు కళామందిరం దుస్థితి చూసి దానిపై కోర్టుకు వెళ్లారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2018 నవంబరులో కోర్టు తీర్పు ఇచ్చి గుడివాడ తహసీల్దార్‌ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి రెవెన్యూ యంత్రాంగం స్థలం స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కబ్జాదారులకు రాజకీయ పెద్దల సహకారం ఉండటంతోనే రెవెన్యూ శాఖ మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శలు వస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే కవిరాజ కళామందిరం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు వినియోగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


Updated Date - 2022-02-23T06:22:23+05:30 IST