అమెరికాలో పూజలపై సమగ్ర విచారణ

ABN , First Publish Date - 2022-07-07T05:57:26+05:30 IST

అమెరికాలో పూజలపై సమగ్ర విచారణ

అమెరికాలో పూజలపై సమగ్ర విచారణ

వివరాలు సమర్పించాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : అమెరికాలో దుర్గమ్మ పూజల నిర్వహణపై దేవదాయ శాఖ స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌కు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ పూజల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన దేవదాయ శాఖ టెంపుల్స్‌ అడ్వైజర్‌, ఎన్నారై వింగ్‌ చెన్నూరి సుబ్బారావును వివరణ కోరారు. అమెరికాలో ఏయే ఆలయాల్లో పూజలు నిర్వహించారు, ఎక్కడెక్కడ ఎంత సమకూరింది అనే అంశాలపై నెలలో వివరాలు సమర్పిస్తానని సుబ్బారావు సమాధానమిచ్చారు. 

వీడని అనుమనాలు

‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘దుర్గమ్మ కానుకలు కొట్టేశారు’ అనే కథనంపై సుబ్బారావు వివరణ ఇచ్చారు. అమెరికాలోని అనేక దేవాలయాలు, భక్తుల విజ్ఞప్తి మేరకు దుర్గామల్లేశ్వర దేవస్థానం నలుగురు పురోహితులను పంపిందని, అమెరికాలో కుంకుమ పూజలు, శివ పార్వతుల కల్యాణాలు, చండీహోమాలు నిర్వహించామన్నారు. సుమారు 2,500 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారని, 10వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. అమెరికాలోని 10 పట్టణాల్లో నిర్ణయించిన దేవాలయాలు ఈ పూజలు నిర్వహించటానికి అయ్యే ఖర్చుని భరించాయని, వారే భక్తుల నుంచి రుసుం తీసుకున్నారని, అది పూర్తిగా వాటి అంతర్గత విషయమన్నారు. అయితే, ఈ పూజలకు స్పాన్సర్లు ముందుకొచ్చినట్లు సాక్షాత్తూ అమెరికాలోని ఓ దేవస్థానం యాజమాన్యమే వెల్లడించింది. స్పాన్సర్లు ఉన్నప్పుడు మళ్లీ రుసుం వసూలు చేయడం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లేదు. పోనీ, రుసుం, కానుకల రూపంలో వసూలు చేసిన మొత్తంలో కొంతైనా దుర్గగుడికి ఎందుకు జమ చేయలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ఈ పూజల వల్ల అనేకమంది భక్తులు అమ్మవారి పూజలు చేసుకోగలిగారని,  విరాళాలు, పరోక్ష సేవా పథకాలను ప్రశంసిస్తున్నారని సుబ్బారావు చెబుతున్నారు. అలాంటప్పుడు భక్తుల నుంచి దుర్గగుడికి నేరుగా విరాళాలు ఎందుకు ఇప్పించలేకపోయారనే ప్రశ్నకు సమాధానం లేదు. అమ్మవారి అలంకరణ వస్తువులేమీ తీసుకెళ్లలేదంటున్నారు. 15 కేజీల బరువున్న అలంకరణ సామాగ్రి తీసుకెళ్లేందుకు ఈవో ఎందుకు అనుమతి ఇచ్చారన్నది సమాధానం దొరకని ప్రశ్న. 

Read more