ఇంటెలిజెన్స్ ఎస్ఐపై వేటు
ABN , First Publish Date - 2022-01-24T06:28:49+05:30 IST
ఇంటెలిజెన్స్ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ఐ శివను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
గన్నవరం నుంచి తప్పించిన అధికారులు
విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విజయవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఇంటెలిజెన్స్ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ఐ శివను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. నియోజకవర్గంలో జరిగే కార్యకలాపాలకు దూరంగా పెట్టడంతోపాటు, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో శివ సాగించిన వ్యవహారాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 18వ తేదీన ‘నిఘా దగా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నారు. ఈ విచారణ దాదాపు పూర్తికావొచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శివను గన్నవరం బాధ్యతల నుంచి తప్పించి, విజయవాడలోని ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదికను మరో రెండు రోజుల్లో ఇస్తారని సమాచారం.