ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి
ABN , First Publish Date - 2022-12-16T00:58:12+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ గురువారం ప్రారంభమైంది. ఊహించనట్టుగానే తొలిరోజే మాలధారులు పోటెత్తారు.
దుర్గమ్మను దర్శించుకున్న 1.25 లక్షల మంది
అంచనాలకు మించి తరలివచ్చిన భవానీలు
కిక్కిరిసిపోయిన కనకదుర్గా నగర్
గిరి ప్రదక్షిణతో రోడ్లన్నీ కిటకిట
తెల్లవారుజాము నుంచే నిండిన క్యూలైన్లు
విజయవాడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ గురువారం ప్రారంభమైంది. ఊహించనట్టుగానే తొలిరోజే మాలధారులు పోటెత్తారు. ఉదయం ఆరు గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతించగా, మహామండపం ఎదురుగా ఏర్పాటుచేసిన హోమగుండాల వద్ద ఆలయ అధికారులు, అర్చకులు అగ్నిప్రతిష్ట చేశారు. వినాయకుడి ఆలయం నుంచి ఏర్పాటు చేసిన క్యూలు మొత్తం తెల్లవారుజాము నుంచే భవానీలతో నిండిపోయాయి. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి భవానీలు భారీగా వచ్చారు. తొలిరోజు 1.25 లక్షల మంది భవానీలు ఇరుముడులు సమర్పించారు. కృష్ణానది ఘాట్లు కిటకిటలాడాయి. కనకదుర్గా నగర్‌తో పాటు వన్‌టౌన్ పరిసర ప్రాంతాలు, వినాయకుడి ఆలయం వద్ద ప్రాంతాలు భవానీలతో ఎరుపెక్కాయి. ఎనిమిది కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అనంతరం భవానీలు దర్శనానికి వెళ్లారు. తొలిరోజు రద్దీ ఎక్కువగా ఉండటంతో టికెట్ లేకుండా దర్శనానికి అనుమతించారు. రూ.500 క్యూలో ఉన్న వారిని ఉచితంగానే అనుమతించారు. అంతరాలయం దర్శనం చేసుకోవాలనుకున్న వారితో మాత్రం టికెట్ కొనిపించారు.
ప్రసాదం పంపిణీతో సరి
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భవానీలకు అన్నదానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శివాలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో షెడ్లు వేయడానికి సిద్ధమయ్యారు. హోమగుండాలు, అన్నదానం షెడ్డు శివాలయం మెట్ల వద్ద ఉండటంతో భక్తులు అక్కడే ఆగిపోయే పరిస్థితులు ఉంటాయని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో షెడ్డు నిర్మాణాన్ని ఆలయ అధికారులు మధ్యలో ఆపేశారు. దీనిపై గురుభవానీలు, పోలీస్, ఆలయ అధికారులు కలిసి ఈవో చాంబరులో సమావేశమయ్యారు. డీఆర్వో మోహన్‌కుమార్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. శివాలయం మెట్లు దిగే మార్గం వద్ద రెండు హోమగుండాలు ఉన్నాయి. మూడో హోమగుండాన్ని పాత మెట్లమార్గం వద్ద ఉన్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేశారు. భవానీలంతా బంధనాలు విప్పించుకున్నాక ద్రవ్యాలను వేయడానికి మొదటి హోమగుండం వద్దే ఉండిపోతున్నారు. రెండు, మూడు హోమగుండాలు ఖాళీగానే కనిపించాయి. అన్నదానం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. తాత్కాలికంగా ఏర్పాటు చేయబోయే షెడ్డులో ప్లేట్లలో భోజనాన్ని వడ్డించాలని (బఫే) నిర్ణయించారు. మధ్యాహ్నం నాటికి అన్నదానం చేయాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. అప్పటికే అన్నదాన విభాగం సిబ్బంది వంటకాలకు సిద్ధం చేసుకున్నారు. షెడ్డు నిర్మాణం పూర్తవ్వకపోవడం, సమఽయం మధ్యాహ్నం కావడంతో ప్రసాదంతోనే భక్తులకు సరిపెట్టారు. కనకదుర్గా నగర్లో నిర్మించిన పెర్గోలా మండపంలో ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. షెడ్డు నిర్మాణం పూర్తి కాగానే శుక్రవారం నుంచి అన్నదానం నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెప్పారు.