మహనీయుల స్ఫూర్తితో..
ABN , First Publish Date - 2022-08-16T06:18:42+05:30 IST
మహనీయుల స్ఫూర్తితో..

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం..
మచిలీపట్నంలో ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా
300 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాల ప్రదానం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు సర్వస్వం త్యాగం చేశారని, వారి స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సోమవారం మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండులో ఘనంగా జరిగింది. ఆర్కే రోజా జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి గుర్తుగా పావురాలను, జాతీయ జెండా రంగులతో ఉన్న బెలూన్లను మాజీ మంత్రి పేర్ని నాని, కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ మహేష్‌కుమార్ రావిరాల, ఎస్పీ పి.జాషువా, ఇతర అధికారులు ఎగురవేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మన జిల్లాకు చెందినవారు కావడం గర్వకారణమన్నారు. అర్హత ఉన్న ప్రతి రైౖతుకూ రైతు భరోసా, సున్నావడ్డీ, పంటల బీమా అందజేశామని, మూడేళ్లలో 4.30 లక్షల మంది రైతులకు రూ.305 కోట్లను రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ద్వారా అందజేశామని చెప్పారు. జిల్లాలో 84,614 గృహాలను మంజూరు చేశామని, ఇందుకోసం రూ.1,523 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 72 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
డిసెంబరు 21న అందరికీ ఇళ్లు
డిసెంబరు 21న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇళ్లను అప్పగిస్తామని రోజా పేర్కొన్నారు. అలాగే, జగనన్న అమ్మఒడి ద్వారా జిల్లాలో 6.29 లక్షల మంది విద్యార్థులకు రూ.924 కోట్లను అందజేశామన్నారు. జిల్లాలో 2.25 లక్షలమందికి ప్రతినెలా ఒకటో తేదీన సచివాలయ వలంటీర్ల ద్వారా రూ.57.03 కోట్లను పింఛనుగా అందజేస్తున్నామన్నారు. బందరు పోర్టు అంశంపై కోర్టు చిక్కులున్నాయని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుని, పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సాగరమాల-ఫేజ్ 2 పథకం కింద మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను రూ.421 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అనంతరం వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న 300 మంది అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు.