కట్లేరుపై వంతెన నిర్మించకుంటే పోటీ చేయను
ABN , First Publish Date - 2022-08-14T06:08:18+05:30 IST
నా హయాంలో కట్లేరుపై వంతెన నిర్మాణం చేయకుంటే తిరువూరు నుంచి పోటీ చేయ నని ఎమ్మెల్యే కె.రక్షణనిధి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే రక్షణనిధి
గంపలగూడెం, ఆగస్టు 13: నా హయాంలో కట్లేరుపై వంతెన నిర్మాణం చేయకుంటే తిరువూరు నుంచి పోటీ చేయ నని ఎమ్మెల్యే కె.రక్షణనిధి స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ 2018లో వచ్చిన వరదకు కట్లేరు వంతెన రెండు కానాలు కొట్టుకుపోయిన సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతునందున కట్లేరు వంతెనను పక్కన పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వంతెన నిర్మాణానికి రూ.19 కోట్లు మంజూరయ్యాయి. డిసెంబరులో టెండర్ వర్క్ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. వంతెన నిర్మాణం చేపట్టకపోతే అసలు ఓట్లు అడగనన్నారు. తోటమూలలో జగనన్న కాలనీలో మంజూరు చేసిన నివేశన స్థలాలు అన్నింటినీ రద్దు చేస్తున్నామని, విచారణ చేసి అర్హులనుఎంపిక చేస్తామన్నారు. కొంగల వినాయకరావు తన అనుచరుడు కాదన్నారు. అతను ప్రభుత్వ భూమిని అక్రమించి గృహ నిర్మాణం చేపడితే దానిని కూల్చి వేశామన్నారు. అతను బోగస్ పట్టాలపై చేసిన వసూల్ దందా తనకు తెలియదన్నారు. అతనిని, గౌర్రాజు నాగరాజులను వైసీపీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నామన్నారు. తోటమూల రింగ్‌లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అద్దెల రూపంలో లక్షలు వసూళ్లు చేస్తున్నారని ఈవ్యవహారంపై ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కోటా శ్యామ్యూల్, చావా వెంకటేశ్వరరావు, చెరుకు నర్సారెడ్డి పాల్గొన్నారు.