విగ్రహ తొలగింపుపై హై టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-09-13T06:42:05+05:30 IST

విగ్రహ తొలగింపుపై హై టెన్షన్‌!

విగ్రహ తొలగింపుపై హై టెన్షన్‌!

- నరసయ్య విగ్రహం తొలగించేందుకు అధికారుల యత్నం

- అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, మహిళలు 

- భారీగా మోహరించిన పోలీసులు 

- గ్రామంలో ఉద్రిక్తత.. అర్థరాత్రి గ్రామస్థుల పహారా

కంచికచర్ల, సెప్టెంబరు 12 : గనిఆత్కూరులో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కొమ్మినేని నరసింహారావు (నరసయ్య) విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు యత్నించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్ద పోలీసులు, టీడీపీ శ్రేణులు మోహరించటంతో సోమవారం సాయంత్రం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత కొమ్మినేని నరసయ్య ఉపసర్పంచ్‌గా, సర్పంచ్‌గా, సొసైటీ అధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో పలు పదవులు నిర్వహించారు. గ్రామాభివృద్ధికి విశేష కృషిచేసిన ఆయన ఏడాది క్రితం మృతిచెందగా.. టీడీపీ కార్యకర్తలు బొడ్డురాయి సెంటర్‌లో పంచాయతీ రోడ్డు పక్కన రూ. 5 లక్షలు వెచ్చించి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపి పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా చేసింది. అయితే నరసయ్య విగ్రహ ఏర్పాటు కొందరు వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. వాహనాల రాకపోకలకు అవరోధంగా ఉందని, విగ్రహాన్ని తొలగించాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి విగ్రహ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈలోగా భారీగా పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. విగ్రహ తొలగింపునకు యత్నిస్తున్నారన్న విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ట్రాఫిక్‌కు అడ్డంకిగా లేనప్పటికీ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరమేంటని కార్యకర్తలు నిలదీశారు. గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ట్రాఫిక్‌కు అవరోధం కాదా.. అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పక్షపాత ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ం మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆందోళన

విగ్రహ తొలగింపు యత్నం గురించి తెలియగానే నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గనిఆత్కూరు గ్రామం చేరుకున్నారు. అధికారుల చర్యలను దుయ్యబడుతూ, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలతో విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ పెద్దల ఒత్తిళ్లతో అధికారులు నరసయ్య విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించటం దారుణం, దుర్మార్గమని పేర్కొన్నారు. ఎలాంటి కారణాలు చూపటం లేదని, ముందస్తుగా నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న  వైఎస్‌ విగ్రహం తొలగించిన తర్వాతే నరసయ్య విగ్రహం వద్దకు రావాలన్నారు. ఆందోళనలో మండల అధ్యక్షుడు కోగంటి బాబు, గ్రామ సర్పంచ్‌ షేక్‌ ఇబ్రహీం, ఉపసర్పంచ్‌ మూరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ సభ్యుడు వెంపరాల వెంకటేశ్వరరావు, గోగినేని అమరనాథ్‌, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 

ం గ్రామంలో టెన్షన్‌ వాతావరణం..

ఒకవైపు పోలీసులు భారీసంఖ్యలో తరలిరాగా.. మరోవైపు కార్యకర్తలు పెద్దఎత్తున మోహరించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని తొలగిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో కూడా విగ్రహం వద్ద పహరా కాస్తున్నారు. 

Read more