దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయి..

ABN , First Publish Date - 2022-09-30T06:49:13+05:30 IST

దసరా ఉత్సవాలలో భక్తులకు అందజేస్తున్న లడ్డు ప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డులా రుచిగా ఉందని భక్తులు చెబుతున్నారని, చాలా ఆనందంగా ఉందని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయి..

- దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

లబ్బీపేట/పాతరాజరాజేశ్వరి పేట : దసరా ఉత్సవాలలో భక్తులకు అందజేస్తున్న  లడ్డు ప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డులా రుచిగా ఉందని భక్తులు చెబుతున్నారని, చాలా ఆనందంగా ఉందని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ, లడ్డు ప్రసాదంపై మంచి స్పందన వస్తున్నదని,  ఏర్పాట్లను భక్తులు మెచ్చుకుంటున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో క్యూలైన్లు ఇతర ఏర్పాట్లను పోలీసు, మున్సిపల్‌ కమిషనర్లతో కలిసి పర్యవేక్షించడం జరిగిందని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు, లేనిచోట్ల తీసివేయడంపై సూచనలు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్‌ విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ పనితనం చాలా బాగుందని, భక్తులు కూడా మెచ్చుకుంటున్నారన్నారు. ఉత్సవాల తీరుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సంతృప్తికరంగా ఉన్నారని, ఏది కావాలన్నా అప్పటికప్పుడు మంజూరు చేస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందిలేకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారని, ఆదిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.  

Read more