దివ్యాంగులపై దయ లేదా!

ABN , First Publish Date - 2022-06-07T06:39:30+05:30 IST

దివ్యాంగులపై దయ లేదా!

దివ్యాంగులపై దయ లేదా!

- సమస్యల పరిష్కారం కోరుతూ మహాధర్నా

- సీఎం హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

- అసెంబ్లీ సీటు కేటాయించాలని వినతి

ధర్నాచౌక్‌, జూన్‌ 6 : సమస్యల పరిష్కారానికి దివ్యాంగులు రోడ్డెక్కారు. సీఎం జగన్‌ గతంలో తమకు ఇచ్చిన హామీలను మూడేళ్లు దాటుతున్నా ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయని, సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో సోమవారం జరిగిన మహాధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నేతలు మాట్లాడుతూ, దివ్యాంగుల పెన్షన్‌ రూ 6 వేలకు పెంచాలని, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, అన్ని రకాల జాబ్‌ రోస్టర్‌ పాయింట్లు పది లోపు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను చర్చించేందుకు దివ్యాంగులకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరారు. ఈ ధర్నాకు సంఘీభావంగా పాల్గొన్న జనసేన నాయకుడు పోతీన వెంకట మహేశ్‌ మాట్లాడుతూ, మహాఽధర్నాకు వస్తున్న దివ్యాంగుల నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని అడగకూడదా? అని ప్రశ్నించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి నిలుపుదల చేస్తున్న పథకాలను పునరుద్దరించాలన్నారు. సీపీఎం నేత సీహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తమ సమస్యలు పరిష్కరించండని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి దివ్యాంగులు నగరానికి వచ్చి ధర్నాచేసే దుస్థితి వచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. నిత్యావసరాల ధరలు వీపరితంగా పెంచేసి పెన్షన్‌ మూడువేలు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. దివ్యాంగుల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేయడం సిగ్గు చేటన్నారు. తమ సమస్యల పరిష్కారానికై ప్రజాక్షేత్రం పోరాడాలని దివ్యాంగులకు పిలుపునిచ్చారు. దీనికి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ఆమ్‌ ఆద్మీ నేత కృష్ణ మాట్లాడుతూ, దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్న వీరిని అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. వీహెచ్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు ఎల్‌.గోపాల్‌రావు, ఏపీ ఇన్‌చార్జ్‌ అందె రాంబాబు, రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేశ్‌, వివిధ జిల్లాల నేతలు, అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

Read more