శరన్నవరాత్రి శోభ

ABN , First Publish Date - 2022-09-25T05:56:34+05:30 IST

శరన్నవరాత్రి శోభ

శరన్నవరాత్రి  శోభ
విద్యుత్‌ వెలుగుల్లో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి

రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రికి ఉత్సవ వెలుగులు

అందంగా ముస్తాబైన ఆలయ ప్రాంగణం

క్యూలైన్ల ఏర్పాట్లు పూర్తి

తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి దర్శనం


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. సోమవారం నుంచి పది రోజుల పాటు కొండపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతించినా, తొలిరోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9 గంటల తరువాతే కల్పిస్తారు. అమ్మవారి దర్శనానికి రోజుకు 60-70 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి కుమ్మరిపాలెం వైపు కొత్త ప్రయోగం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణ సమయంలో దుర్గాఘాట్‌ వద్ద నిర్మించిన సబ్‌వే నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ మార్గం సఫలమైతే కొనసాగించాలని, ఏమైనా ఇబ్బందులు వస్తే ఇంద్రకీలాద్రి పక్క నుంచి నిర్మించిన క్యూలైన్‌ నుంచి భక్తులను అనుమతించాలనుకుంటున్నారు. 

విద్యుద్దీప వెలుగులు

ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. ఇప్పటికే క్యూలైన్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అలంకరణలు ఉచితంగా చేయడానికి ప్రకాశం జిల్లాకు చెందిన భక్తుడు ముందుకొచ్చారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను వలంటీర్లుగా నియమించారు. వృద్ధులు, వికలాంగులను దర్శనానికి తీసుకెళ్లడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నగరోత్సవం ఘనంగా జరగనుంది. తొలిరోజు నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. వాస్తవానికి ఉత్సవాల ప్రారంభ సమయానికి ప్రభుత్వం పాలకమండలిని గానీ, ఉత్సవ కమిటీని గానీ నియమిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, ఎలాంటి కమిటీ లేకుండా వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తున్నారు.


Read more