నమామి నిత్యానందకరి

ABN , First Publish Date - 2022-09-30T06:00:37+05:30 IST

నమామి నిత్యానందకరి

నమామి నిత్యానందకరి
కనువిందుగా నగరోత్సవం

అన్నపూర్ణాదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు

దర్శనానంతరం అన్న ప్రసాద స్వీకరణ

ఉదయం నుంచి కొనసాగిన రద్దీ

క్యూలైన్లన్నీ కిటకిట


అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. ఆర్తితో అడిగిందే చాలు.. ఎంతటి ఆకలి దప్పికలనైనా తీర్చి క్షుద్బాధను తొలగించే ఆదిదేవత పరమేశ్వరి. పరమేశ్వరుడికే భిక్షను ప్రసాదించిన అమృతమూర్తి అన్నపూర్ణాదేవి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైన ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించి భక్తకోటి తరించింది. చేతిలో అక్షయపాత్ర ధరించి, ఆదిభిక్షువుకు అన్నాన్ని ప్రసాదిస్తున్న అవతారంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి భక్తులు ఆనందంతో అన్న ప్రసాదాలు స్వీకరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి గురువారం కూడా నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా కనిపించింది.


విజయవాడ/చిట్టినగర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాల్గో రోజైన గురువారం కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. శుక్రవారం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశముంది. అయితే, అధికారులు ఏరోజుకారోజు పరిశీలించి లోపాలను సరి చేసుకోవడానికి సమీక్షలు చేస్తున్నప్పటికీ భక్తులు మాత్రం సంతృప్తి చెందట్లేదు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంపై మండిపడుతున్నారు.

అమ్మ సేవలో ప్రముఖులు

కనకదుర్గమ్మను గురువారం విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం కార్యక్రమాల కార్యదర్శి తలశిల రఘురాం, డిప్యూటీ స్పీకర్‌ కొలగంట్ల వీరభద్రస్వామి, ఇంటెలిజెన్స్‌ డీజీ పి.సీతారామాంజనేయులు తదితరులు దర్శించుకున్నారు.

రూ.500 టికెట్‌ కొని ఉపయోగమేంటి?

‘మేం సీనియర్‌ సిటిజనులం. ఎక్కువ సేపు క్యూలో నిలబడలేం. దర్శనం త్వరగా అవుతుందని రూ.500 టికెట్‌ కొన్నాం. అయినా ఉపయోగమేమీ లేదు.’ రూ.500 క్యూలో ఉన్న భక్తులు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఓం మలుపు నుంచి వీఐపీ కేటగిరిలో భక్తులకు రూ.500 క్యూ ఏర్పాటు చేశారు. ఇతర క్యూల్లో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందని, వారంతా రూ.500 టికెట్లు కొన్నారు. ఉచిత, రూ.100, రూ.300 టికెట్ల భక్తుల మాదిరిగానే దర్శనానికి సమయం పట్టడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలు ఇలా వచ్చి అలా దర్శనాలు చేసుకుని వెళ్లిపోతున్నారని, తాము మాత్రం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందన్నారు. 

Read more