అరుణకీలాద్రి

ABN , First Publish Date - 2022-10-07T06:24:16+05:30 IST

అరుణకీలాద్రి

అరుణకీలాద్రి

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ మాలధారులు

దసరా ఉత్సవాలు ముగిసినా తగ్గని రద్దీ

ఆలయ పరిసరాలు, ఘాట్లలో కిటకిట

వర్షంలోనూ తగ్గని భక్తుల సంఖ్య

ఆదివారం వరకూ ఇదే పరిస్థితి

తెప్పోత్సవం రద్దు.. ప్రత్యేక పూజలతో సరి


విజయవాడ/చిట్టినగర్‌/ వన్‌టౌన్‌  : ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారుల తాకిడి పెరిగింది. విజయదశమికి ముందురోజు నుంచి భవానీలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. వినాయకుడి ఆలయం నుంచి కొండపైన అమ్మ అంతరాలయం వరకూ క్యూల్లో భవానీలే దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు, ఘాట్లు ఎరుపువర్ణాన్ని పులుముకున్నాయి. గురువారం 70-80 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం వరకూ రద్దీ కొనసాగే అవకాశముంది. శివాలయానికి వెళ్లే మార్గంలో కొబ్బరికాయలు కొట్టి ఇరుముడులను దించుకుంటున్నారు.  భవానీలు భారీగా వస్తారని తెలిసినా దేవస్థాన అధికారులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఇరుముడులను బాలాయానికి సమీపాన ఉన్న షెడ్డులో వదిలేస్తున్నారు.

ముగిసిన దసరా ఉత్సవాలు

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో బుధవారం మధ్యాహ్నం అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆశీర్వచన కార్యక్రమానికి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో భ్రమరాంబ, దసరా ఉత్సవాల ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రికి, అతిథులకు హోమ భస్మాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 2.50 లక్షల మంది వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్‌, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

తెప్పోత్సవం రద్దు

వర్షం కారణంగానే.. 20 ఏళ్లలో రెండోసారి

కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో దుర్గగుడి అధికారులు గంగా సమేత దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ఈ ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని తొలుత అధికారులు, అర్చకులు నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జోరున వర్షం మొదలైంది. మధ్యలో కాసేపు విరామం ఇచ్చినప్పటికీ తిరిగి 3 గంటలకు మళ్లీ కురిసింది. వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో తెప్పోత్సవం నది వద్ద నిర్వహించడం కష్టమన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. సాయంత్రం 5 గంటల్లోపు వర్షం తగ్గితే ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకు వెళ్లాలని భావించారు. పరిస్థితులు అనుకూలించకపోతే ఏం చేయాలన్న దానిపై ఈవో భ్రమరాంబ వైదిక కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీ, ఏడీసీపీలు కొల్లి శ్రీనివాస్‌, లక్ష్మీపతి, ఏసీపీ హనుమంతరావు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలు అవుతున్నా వర్షం తగ్గకపోవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఉత్సవ మూర్తులు వర్షంలో తడవకూడదని, అందువల్ల తెప్పోత్స వాన్ని రద్దు చేశామని స్పష్టం చేశారు. మహామండపంలోని ఆరో అంతస్థులోనే ఉత్సవమూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి హారతులు ఇస్తామని చెప్పారు. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు అనుకూలించక తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. మళ్లీ ఈ ఏడాది ఆ పరిస్థితి వచ్చింది.












Updated Date - 2022-10-07T06:24:16+05:30 IST