భక్తగిరి

ABN , First Publish Date - 2022-10-03T05:56:29+05:30 IST

భక్తగిరి

భక్తగిరి

సరస్వతీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

అర్ధరాత్రి నుంచి బారులు తీరిన భక్తులు

నిండిపోయిన క్యూలైన్లు, ప్రధాన రహదారులు

లైన్లు సరిపోక రోడ్లపై గంటలకొద్దీ పడిగాపులు

బ్యాచ్‌లుగా వదిలిన పోలీసులు

సమన్వయంతో పనిచేసిన యంత్రాంగం

ఎలాంటి ఇబ్బందులూ లేకుండా త్వరితగతిన దర్శనం

రెండు లక్షలు దాటిన భక్తుల సంఖ్య

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌


విజయవాడ, ఆంధ్రజ్యోతి/చిట్టినగర్‌ : ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కొండ కింద నుంచి పై వరకు ఎక్కడచూసినా జనసంద్రమే కనిపించింది. మూలానక్షత్రం రోజున అమ్మను దర్శించుకోవడానికి భక్తులు నడిరోడ్డుపై గంటలకొద్దీ పడిగాపులు పడ్డారు. సరస్వతీదేవి అలంకారంలో అమ్మ దర్శనం కాగానే, ఆనందంతో మురిసిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు రోడ్లపై బారులు తీరారు. అవకాశం ఉన్నవారు క్యూల్లో సర్దుకోగా, మిగిలిన వారంతా వీఎంసీ కార్యాలయం వరకు ఉన్న రహదారులపైకి వచ్చేశారు. కొవిడ్‌ తర్వాత మూలానక్షత్రం రోజున  భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి రావడం ఇదే ప్రథమం. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకు 1.50 లక్షల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తొలి దర్శనం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఆలయ అధికారులు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. వీఐపీ దర్శనాలను బాగా కట్టడి చేయడంతో క్యూల్లో ఉన్న భక్తులు ఆగకుండా అడుగులు ముందుకు వేశారు. అమ్మవారికి నివేదనలు సమర్పించిన సమయంలోనూ, ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలను సమర్పించిన సమయంలోనూ దర్శనాలను నిలుపుదల చేశారు.

క్యూలన్నీ కిటకిట

క్యూలన్నీ నిండిపోవడంతో రహదారులపై ఉన్న భక్తులను బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వదిలారు. వినాయకుడి ఆలయం వద్ద ఫ్లై ఓవర్‌ వరకు ఉన్న రహదారులు దర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. రహదారులపై ఉన్న భక్తులను క్యూల్లోకి తీసుకురావడం కోసం టోల్‌గేట్‌ వద్ద ఉన్న క్యూ అత్యవసర ద్వారం నుంచి భక్తులను ఘాట్‌రోడ్డు మీదుగా పైకి పంపారు. వేగంగా క్యూ ఖాళీ కావడంతో రహదారిపై ఉన్నవారిని లైన్లలోకి వదిలారు. ఏటా ఉదయం 11 గంటలకు రహదారులపై ఉన్న జనం క్యూల్లోకి వెళ్లిపోయేవారని, ఈ ఏడాది మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకు అదే పరిస్థితి కనిపించిందని పోలీసులు తెలిపారు. 

ఆల్‌టైమ్‌ రికార్డు

మూలానక్షత్రం రోజున దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి దుర్గమ్మను లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం కూడా క్యూలు పోటెత్తాయి. సీతమ్మవారి పాదాలు, కార్పొరేషన్‌, కంట్రోల్‌ రూమ్‌ ఫ్లై ఓవర్ల మీదకు భారీగా చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. కానీ, క్యూల్లో ఉన్న వారంతా దర్శనం చేసుకునేలా కొంత సమయం పొడిగిస్తారు. ఈ లెక్కన చూస్తే మరో లక్ష మందికిపైగానే సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఒక్క మూలానక్షత్రం రోజున రెండున్నర లక్షల మంది పైచిలుకు భక్తుల రాకతో ఆల్‌టైమ్‌ రికార్డు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

దర్శనానికి మూడు గంటలు

మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తడంతో దర్శనానికి గరిష్టంగా మూడు గంటల సమయం పట్టింది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల కారణంగా అంతరాలయ దర్శనాలు లేకపోవటం, అనధికార వీఐపీలను నియంత్రించటంతో ఎలాంటి అవాంతరాలూ జరగలేదు. Read more