మంత్రి వర్సెస్‌ మాజీ

ABN , First Publish Date - 2022-10-01T05:28:47+05:30 IST

మంత్రి వర్సెస్‌ మాజీ

మంత్రి వర్సెస్‌ మాజీ

అక్కడే మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నా పట్టకుండా వెళ్లిన వెలంపల్లి

ఐదు వాహనాల్లో నేరుగా కొండపైకి..

30 మంది అనుచరులతో ఏకకాలంలో దర్శనానికి..

వెలంపల్లి తీరుపై భక్తుల ఆగ్రహం


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఒకరు దేవదాయ శాఖ మంత్రి. మరొకరు మాజీ మంత్రి.  ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే. అయినా పలకరింపుల్లేవ్‌.. కనీసం చిరునవ్వులు లేవ్‌.. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం కనిపించిన దృశ్యమిది. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మొదటి నుంచి టికెట్ల విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. వీఐపీ సిఫార్సులతో వచ్చినా భక్తులు కచ్చితంగా రూ.500 టికెట్లు కొనాలని పదేపదే చెబుతున్నారు. తన సిఫార్సుతో దర్శనానికి వెళ్లే వారితోనూ టికెట్లు కొనిపిస్తున్నారు. పోలీసులూ ఇదేవిధంగా చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం టికెట్‌ కొనాలన్న అంశం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అయితే, వీఐపీ కోటాలో టికెట్‌ కొనే విషయం కొందరు అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇందులో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముందున్నారు. ఆయన దర్శనానికి వచ్చారంటే వెంట వచ్చే వారికి టికెట్లతో సంబంధాలు ఉండవు. ప్రొటోకాల్‌లోనే వెళ్తారు. ఆయన దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడూ ఇదే తంతు సాగించారు. ఇప్పుడు ఎమ్మెల్యే గానూ ఇదే చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనతో వెలంపల్లి ఒక ప్రణాళిక ప్రకారం ఈవిధంగా చేస్తున్నారని పలువురు భక్తులు భావిస్తున్నారు. 

ఐదు వాహనాల్లో 30 మంది

దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం ముఖద్వారం వద్ద ఉన్న మీడియా గ్యాలరీలో ఉన్నారు. అదే సమయంలో వెలంపల్లి శ్రీనివాసరావు ఐదు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఓం మలుపు వద్ద ఉన్న పోలీసులు వెలంపల్లి ఉన్న కారును మాత్రం పైకి అనుమతించి, మిగిలిన కార్లను నిలుపుదల చేశారు. దీనికి వెలంపల్లి ఒప్పుకోలేదు. పట్టుబట్టి మరీ ఆపేసిన వాహనాలను పైకి రప్పించుకున్నారు. దర్శనానికి వెలంపల్లి దంపతులే కాకుండా మరో 30 మందిని తీసుకెళ్లారు. వీరంతా డిజిగ్నేటెడ్‌ వీఐపీలు వెళ్లే మార్గంలోనే దర్శనాలకు వెళ్లడం గమనార్హం. ముఖద్వారం మెట్లు దిగిన తర్వాత పూర్ణకుంభంతో ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శనానికి తీసుకెళ్లారు. అంతా వేద ఆశీర్వచనం మండపం నుంచే దర్శనానికి వెళ్లారు. వెలంపల్లి వెళ్లేటప్పుడు మంత్రి మీడియా గ్యాలరీ వద్ద ఉన్నా పలకరించలేదు. దర్శనం పూర్తయినా మంత్రితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 
Read more