సీఎం హామీ నిలబెట్టుకోవాలి

ABN , First Publish Date - 2022-08-04T06:41:10+05:30 IST

విద్యుత్‌ రంగ సంస్థలైన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జెఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

సీఎం హామీ నిలబెట్టుకోవాలి

- విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్‌ 

గవర్నర్‌పేట, ఆగస్టు 3 : విద్యుత్‌ రంగ సంస్థలైన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జెఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకె)లో రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశీ అధ్యక్షత వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్‌ రంగ సంస్థల్లో 26 వేలమంది ఎదుగూబొదుగూ లేకుండా ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని, పనికి తగిన వేతనం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు ఆయనకు విన్నవించగా అధికారంలోకి రాగానే కార్మికులను సంస్థలో విలీనం చేసుకుంటామని హామీఇచ్చారని గుర్తు చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన బాలకాశీ మాట్లాడుతూ, తెలంగాణాలో మాదిరిగా ఏపీ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో  ఏఐటియూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాధాకృష్ణ, విద్యుత్‌ కాంట్రాక్టు జెఏసీ నాయకులు కట్టా నాగరాజు, ఎం.దుర్గారావు, సి.చంద్రశేఖర్‌, పి.శివయ్య, డి.సూరిబాబు, ప్రేమ్‌కుమార్‌, డేవిడ్‌ రాజు ప్రసంగించారు. సదస్సులో జెఏసీ నేతలు ఏ.రాజేంద్రప్రసాద్‌, ఏ.రాజశేఖర్‌, స్వతంత్రకుమార్‌, వి.సాంబిరెడ్డి, పి.బాబు, ఎన్‌.చిన్న రామస్వామి, పి.ప్రేమ్‌కుమార్‌, పి.శ్రీనివాసరావు, వి.రామాంజనేయులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందరినీ విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని సదస్సు తీర్మానించింది. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 4 నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు ఆందోళనలు సాగించి, అక్టోబరు 20న చలో విద్యుత్‌సౌధ (గుణదల)నిర్వహించాలని ప్రకటించారు. 

Updated Date - 2022-08-04T06:41:10+05:30 IST