అమరావతికే జై
ABN , First Publish Date - 2022-10-17T06:13:43+05:30 IST
అమరావతికే జై
సీపీఐ జాతీయ మహాసభల్లోనూ అమరావతికే ఓటు
రాజధానిని కొనసాగించాలంటూ తీర్మానం
ఆమోదం తెలిపిన 29 రాష్ర్టాలు
ముక్తకంఠంతో అమరావతి జయజయధ్వానాలు
‘విభజనతో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే పెద్దదిక్కు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కొనసాగించాలి.’ ఒక్కరు చెప్పిన మాట కాదిది. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల వాక్కు. విజయవాడలో జరుగుతున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో ఆదివారం జరిగిన ప్రతినిధుల సభలో అందరూ అమరావతికి ముక్తకంఠంతో జై కొట్టారు.
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి సీపీఐ అమరావతికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. నగరంలో జరుగుతున్న సీపీఐ 24వ మహాసభల్లోనూ అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో జాతీయస్థాయి సమస్యలపైనే కాకుండా రాష్ట్రానికి చెందిన అంశంపైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అమరావతి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. అలాగే, మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు సీపీఐ తీసుకున్న నిర్ణయాన్ని సభ ముందుకు తెచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా విజయవాడను చేయాలని సీపీఐ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. నవ్యాంధ్ర భౌగోళిక స్వరూపం రీత్యా గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలన్న నిర్ణయాన్ని సీపీఐ ముందుగానే వెల్లడించిందన్నారు. నాగేశ్వరరావు ప్రసంగం పూర్తయ్యాక 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అభివృద్ధికి ఏమాత్రం దోహదపడవన్నారు. రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలోనే ఉంటుందని, అభివృద్ధి మాత్రమే వికేంద్రీకరణ రూపంలో నలుదిక్కులా విస్తరిస్తుందని చెప్పారు. ప్రతినిధులంతా ఆయా రాష్ట్రాల్లో రాజధాని పరిస్థితులు, అక్కడ జరిగిన అభివృద్ధిని, వస్తున్న ఆదాయాన్ని వివరించారు. చివరికి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందినట్టుగా సభలో ప్రకటించారు.
నేడు అమరావతిలో కేరళ ఎంపీ పర్యటన
రాజధాని ప్రాంతంలో పర్యటించడానికి సీపీఐ కేరళ బృందం సిద్ధమైంది. కేరళ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సంతోష్‌తో పాటు పలువురు సోమవారం అమరావతిలో పర్యటిస్తారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటారు.
