కోర్టుల భవనసముదాయం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-17T06:50:43+05:30 IST

ఎంతోకాలంగా న్యాయవాదులు, కక్షిదారులు ఎదురుచూస్తున్న సిటీ సివిల్‌ కోర్టుల నూతన భవన సముదాయం ప్రారంభానికి ముహూర్తం సమీపించింది.

కోర్టుల భవనసముదాయం సిద్ధం

- 20న సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రమణతో ప్రారంభం

- సుమారు రూ.100 కోట్ల వ్యయం

- పార్కింగ్‌, బ్యాంక్‌, పోస్టాఫీస్‌, క్యాంటీన్‌ ఏర్పాటు

విజయవాడ లీగల్‌, ఆగస్టు 16 : ఎంతోకాలంగా న్యాయవాదులు, కక్షిదారులు ఎదురుచూస్తున్న సిటీ సివిల్‌ కోర్టుల నూతన భవన సముదాయం ప్రారంభానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 20న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ బహుళ అంతస్తుల భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. తొలుత భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. సీనియర్‌ న్యాయవాది, మాజీ బార్‌ అధ్యక్షుడు చేకూరి శ్రీపతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో పనులు వేగవంతం చేసి నిర్మాణం పూర్తిచేశారు. గ్రౌండ్‌+8  భవనంలో ఏడు అంతస్తుల్లో నాలుగేసి కోర్టులుంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కొంతమేర పార్కింగ్‌, క్యాంటీన్‌, బ్యాంకు, పోస్టాఫీసు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మార్పు చేర్పులుంటాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఒక అంతస్తులో కాన్ఫరెన్స్‌ హాలు (సమావేశ మందిరం) ఏర్పాటు చేస్తున్నారు. సిటీ సివిల్‌కోర్టు నూతన బిల్డింగ్‌లో 29 కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఏడు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో న్యాయమూర్తులకు ప్రత్యేకంగా రెండు కేటాయిస్తారు. ప్రతి అంతస్తులోను న్యాయవాదులకు విశ్రాంతి గదులు కేటాయించారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు ప్రతి ఫ్లోర్‌లో గదులను కేటాయించారు. నూతన భవన సముదాయం చూట్టూ వున్న పాత క్రిమినల్‌ కోర్టు బిల్డింగ్‌, ఎంఎ్‌సజే కోర్టు బిల్డింగ్‌లను తొలగించి ఆ ప్రదేశంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండటంతో మాజీ బార్‌ అధ్యక్షుడు చేకూరి శ్రీపతి హైకోర్టులో పిల్‌ వేయడంతో హైకోర్టు, సిటి సివిల్‌ కోర్టు నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకున్నాయి. దీంతో పనుల్లో వేగం పెరిగి ఈనెల 20న ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రైల్వేకోర్టు, తాలూకా కోర్టు (మొదటి మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌), కార్పొరేషన్‌ కోర్టు (మూడవ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌) ఎక్కడివి అక్కడే వుంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో పాటు గవర్నర్‌, ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. 

Read more