పైరవీలు, పైసలదే.. పైచేయి

ABN , First Publish Date - 2022-07-07T06:02:04+05:30 IST

పైరవీలు, పైసలదే.. పైచేయి

పైరవీలు, పైసలదే.. పైచేయి

దుర్గగుడిలో ఇష్టారాజ్యంగా బదిలీలు

అస్మదీయులైతే 18 ఏళ్ల సర్వీసైనా పర్లేదు

తస్మదీయులకు రెండున్నరేళ్లకే స్థానచలనం

దేవదాయ కమిషనరేట్‌లో చక్రం తిప్పిన అధికారి

మండిపడుతున్న ఉద్యోగులు


దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సుమారు18 ఏళ్లుగా సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళను వితంతువు అనే కారణంగా బదిలీ నుంచి మినహాయించారు. అలాగే, సుమారు ఐదేళ్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మరో వితంతువును మాత్రం బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఇద్దరూ బదిలీకి అర్హులే.               కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఒకరు బదిలీ అయ్యారు.. మరొకరు తప్పించుకున్నారు. పైరవీలు, పైసలున్న వారిని పక్కనపెట్టి.. ఏ సిఫారసులు లేని, రాజకీయ సహకారం పొందని వారిని మాత్రం బదిలీ చేయడంపై దుర్గగుడి ఉద్యోగులు మండిపడుతున్నారు. 


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : దుర్గగుడి బదిలీల్లో రాజకీయ పైరవీలు, కమిషనరేట్‌లో పనిచేసే ఓ అధికారి చేతివాటం బాగా పనిచేశాయనే ఆరోపణలు వస్తున్నాయి. 40 మంది ఉద్యోగులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనతో కమిషనర్‌ కార్యాలయానికి జాబితా చేరింది. పైరవీలు, పైసలు పనిచేయడంతో ఈ జాబితాలో ఐదు పేర్లు గల్లంతై, 35 మందినే బదిలీ చేశారు. వీరిలో చాలామంది సహేతుకమైన కారణాలు చూపినప్పటికీ.. రాజకీయ సపోర్టు లేక బదిలీ నుంచి తప్పించుకోలేకపోయారు. భార్య అనారోగ్యంతో బాధపడుతున్నా, సర్వీసు రెండున్నరేళ్లే పూర్తయినా బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు.

కమిషనరేట్‌ అధికారి చేతివాటం

సాధారణ బదిలీల్లో భాగంగా ఇటీవల దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఏఈవో, సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, డిప్యూటీ ఈఈ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగులు 35 మందిని బదిలీ చేశారు. వీరిలో కొంతమందిని అన్నవరం వీరవెంకట సత్యనారాయణ దేవస్థానానికి, మరికొందరిని ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి, పెనుగంచిప్రోలులోని లక్ష్మీతిరుపతమ్మ గుడికి బదిలీ చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో కమిషనర్‌ కార్యాలయంలోని ఓ అధికారి చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా బదిలీలు చేసేటప్పుడు ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌లోని అంశాలు, పనితీరు నివేదికలు, దీర్ఘకాలం ఒకేచోట పనిచేస్తుండటం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి బదిలీల్లో ఇవేమీ ప్రామాణికంగా తీసుకోలేదు. కేవలం పైరవీ, పైసలు మాత్రమే పనిచేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం అధికారులు పంపించిన నివేదికలో బదిలీ కావడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అలాంటి వారి పేర్లను కమిషనర్‌ కార్యాలయంలోని ఓ అధికారి తొలగించారని చెబుతున్నారు. దుర్గగుడి అఽధికారులు పంపించిన బదిలీ జాబితాలో 40 మంది పేర్లు ఉండగా, వాటిలో ఐదు పేర్లు తొలగించి 35 మందినే బదిలీ చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రక్రియపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

బదిలీలు ఇలా..

- తన భార్య రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోందని, తనకు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని  సూపరింటెండెంట్‌ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి విన్నవించినా పట్టించుకోలేదు. ఆయన సంబంధిత మెడికల్‌ రిపోర్టులు అందజేసినప్పటికీ బదిలీ చేశారు. 

- సుమారు 20 ఏళ్లుగా దుర్గగుడిలో గుమస్తాగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి మాత్రం బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. దేవదాయ శాఖ మాజీ మంత్రి సిఫారసుతోనే ఇలా జరిగిందని ఉద్యోగులే చెబుతున్నారు. అదే సమమయంలో దుర్గగుడికి బదిలీపై వచ్చి రెండున్నరేళ్లు కూడా పూర్తికాని మరో ఉద్యోగిని అన్నవరం బదిలీ చేసేశారు.

- సుమారు 20 ఏళ్లుగా దుర్గగుడిలోనే విధులు నిర్వహించి, గత ఏడాది బదిలీల్లో ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లిన మరో ఉద్యోగి ఈసారి బదిలీల్లో తిరిగి దుర్గగుడికి రావడం గమనార్హం. 

- కాగా, శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానానికి ఇతర దేవాలయాల నుంచి బదిలీ అయిన ఉద్యోగులు సుమారు 25 మంది మంగళ, బుధవారాల్లో బాఽధ్యతలు స్వీకరించారు. 

Read more