అక్రమ మట్టి తవ్వకాల్లో తగ్గేదే లేదు

ABN , First Publish Date - 2022-04-25T06:01:52+05:30 IST

అక్రమ మట్టి తవ్వకాల్లో తగ్గేదే లేదు

అక్రమ మట్టి తవ్వకాల్లో తగ్గేదే లేదు

ఎక్కడా తవ్వకాలు ఆపే ప్రసక్తే లేదు

అడ్డుకోవాలంటే బదిలీకి సిద్ధమవ్వండి

మోటూరుకు అర్ధరాత్రి ఆర్‌ఐ ఎందుకు వెళ్లినట్టు?

మీడియాకు ముందే ఎవరు సమాచారమిచ్చారు?

అధికారులకు వైసీపీ గుడివాడ అధినాయకత్వం క్లాస్‌

అంతర్గత సమావేశంలో హెచ్చరికలు


‘మా వాళ్లు మట్టి తవ్వుకుంటారు. తోలకాలు ఆగే ప్రసక్తే లేదు. భవన నిర్మాణాలకు అనుకూలమైన వాతావరణం వేసవిలో తప్ప మళ్లీ ఉండదు. సీనరేజి కట్టించుకుని అనుమతులు మంజూరు చేయండి. ఎవరికైనా ఇష్టం లేకపోతే మాతో చెప్పండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ చేయిస్తాం. మట్టి తవ్వకాలను ఆపడానికి వెళ్లి ఇబ్బంది పడొద్దు. మోటూరులో మట్టి తవ్వకాలను ఆపడానికి ఆర్‌ఐ అరవింద్‌ ఒక్కరే గురువారం అర్ధరాత్రి ఎందుకు వెళ్లినట్టు..? పోలీసుల కంటే మీడియాకు ముందే సమాచారం ఎవరిచ్చారు. మోటూరు ఘటనలో ఏదో కుట్ర ఉంది. అధికార పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కావాలనే ఇదంతా చేశారని భావించాల్సి వస్తోంది. దీనికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ రంజిత్‌ బాషాను కోరాం’. ఇదీ అధికార పార్టీ గుడివాడ అధినాయకత్వం వివిధ శాఖల అధికారులను అంతర్గతంగా హెచ్చరించిన విధానం. 

గుడివాడలో వైసీపీ నేతల మట్టి అక్రమ తవ్వకాలను నిలువరించి దిద్దుబాటు చేయాల్సిన కీలక నాయకులు.. అధికారులనే తీరు మార్చుకోమని చెప్పి మరోసారి కాలుదువ్వారు.  


గుడివాడ, ఏప్రిల్‌ 24 : ‘లే అవుట్ల మెరక కోసం మట్టి తవ్వకాలకు ఎక్కడ, ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా తవ్వుతున్నట్లు ఫిర్యాదు చేస్తే తవ్వకందారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చేపల చెరువుల బాగుజేత, నూతన చేపల చెరువుల తవ్వకాలు వంటి వాటికి అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా తవ్వకాలకు ప్రయత్నిస్తే సహించేది లేదు.’ అంటూ తహసీల్దార్లు, గుడివాడ ఆర్డీవోలు చేసిన హెచ్చరికలు తాటాకు చప్పుళ్లుగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలపై ఆంక్షలు విధిస్తే సహించేది లేదని అధికార యంత్రాంగానికి గుడివాడ వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేయడమే ఇందుకు కారణం. దీంతో గుడివాడ నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. గత ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అధికార పార్టీ మట్టి తవ్వకందారులు ప్రస్తుతం అమలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా భారీ యంత్రాలు, తోలకాలకు టిప్పర్లను రంగంలోకి దింపడంతో రూ.కోట్ల విలువైన మట్టి బయటి ప్రాంతాలకు తరలుతోంది. ప్రధానంగా గుడివాడ పట్టణంలో రెండు ప్రైవేట్‌ లే అవుట్లు మెరక చేయడానికి అధికార పార్టీకి చెందిన మట్టి మహారాజు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. పేరుకు జగనన్న లే అవుట్లు మెరక చేయడానికి పర్మిట్లు తీసుకుని ప్రైవేట్‌ లే అవుట్లకు తరలిస్తున్నారని సమాచారం.

ఆర్‌ఐపై దాడి కేసు నీరుగార్చే యత్నాలు

ఆర్‌ఐపై హత్యాయత్నం, భౌతిక దాడి సంఘటన అనంతరం అధికార పార్టీ నాయకులు డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగానే మట్టి తవ్వకాలపై అధికారులకు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తులు తమ పార్టీ వారు కాదనే వాదన వీగిపోవడంతో ఆర్‌ఐ అరవింద్‌ను తప్పుబట్టినట్టు తెలిసింది. మోటూరు మట్టి తవ్వకాల సూత్రధారి, దాడులకు కారణమైన ఘంటా సురేష్‌ను ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సొంత పనులకు ఇలా.. 

సారవంతమైన నేలలు ఉన్న గుడివాడ పరిసర ప్రాంతాల మట్టికి భారీ డిమాండ్‌ ఉంది. అలాగే, గుడివాడ చుట్టూ కొత్త బైపాస్‌ రోడ్డు వేస్తున్న విషయం తెలిసిందే. బైపాస్‌ రోడ్డు వేయడానికి తవ్వి తీసిన మట్టిని గుడివాడ రూరల్‌ మండలంలోని బొమ్ములూరు సరిహద్దులోని లే అవుట్‌ మెరక చేయడానికి వినియోగించారు. ప్రైవేట్‌ రియల్టర్లకు ఎంత కావాలంటే అంత దొరికే మట్టి.. పేదలకు కేటాయించిన ప్లాట్లను మెరక చేయడానికి మాత్రం లభించట్లేదు. పదేళ్ల క్రితం రూ.112 కోట్లతో చేపట్టిన బుడమేరు ఆధునికీకరణ పనుల్లో వచ్చిన మట్టి పార్టీలతో సంబంధం లేకుండా నందివాడ మండలంలోని రాజకీయ గద్దలపరమైంది. కొంతమంది రెండు తాటిచెట్ల ఎత్తున బుడమేరులో మెరక చేసి ఏటిలో ఫ్యాక్టరీలు నిర్మించారు. కనీసం ఆధునికీకరణ పనుల అనంతరం బుడమేరు తీర ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించినా పేదల ఇళ్ల స్థలాల మెరకకు అవసరమైన లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మట్టి అందుబాటులోకి వస్తుంది. 

జగనన్న ఇళ్ల మెరక ఓ కల

జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రారంభానికి నెలాఖరు వరకూ గడువు విధించడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ పేదలను ఉద్దేశించి తీర్చిదిద్దిన మల్లాయిపాలెం లే అవుట్‌లో సైతం రహదారులు, నీటి వసతి, విద్యుత్‌, డ్రెయినేజీలు వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. నియోజకవర్గంలో ప్లాట్లు పంపిణీ చేసి రెండేళ్లు గడుస్తున్నా పది శాతం కూడా అభివృద్ధికి నోచుకోలేదు. వీటి మెరకకు మట్టి అందుబాటులో లేక అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయా గ్రామాల చెరువుల మట్టి తవ్వుకుందామంటే అప్పటికే అధికార పార్టీ నాయకులు తవ్వకాలు పూర్తి చేసేస్తున్నారు. చేపల చెరువులు ఎక్కువగా ఉన్న నందివాడ మండలంలో మట్టి అతి ఖరీదైన వనరుగా మారింది. ఈ నేపథ్యంలో నందివాడ మండలంలోని లక్ష్మీనరసింహపురం, కుదరవల్లి జగనన్న లే అవుట్లు నీటిలో నానుతూనే ఉన్నాయి. రుద్రపాక, పోలుకొండ గ్రామాల్లోని లే అవుట్లు వ్యవసాయ క్షేత్రాలను తలపిస్తున్నాయి.  నందివాడ మండలంలో 19 జగనన్న లే అవుట్లు వేశారు. వీటిలో ఐదు మినహా మిగిలినవన్నీ గత ప్రభుత్వాలు వేసినవే. చుట్టూ చెరువులు ఉండటంతో నాటి నుంచి వాటిని మెరక చేయలేదు. నందివాడ మండలంలో ప్రవహించే బుడమేరు ఆధునికీకరణ పనుల్లో లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి వచ్చినా వినియోగించలేదు. చేదుర్తిపాడులో బుడమేరు ఆధునికీకరణ పూడికతీత పనులు మొదలయ్యాయి. కనీసం ఆ మట్టినైనా తమ   లే అవుట్ల మెరకకు వినియోగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గుడివాడ పట్టణంలోని మల్లాయిపాలెం లే అవుట్‌, గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు మండలాల్లోని గ్రామాల లే అవుట్లలోనూ కాస్త అటుఇటుగా ఇదే పరిస్థితి నెలకొంది. నవరత్నాల్లో కీలకమైన గృహ నిర్మాణాలకు మట్టి లేక అధికారులు తలపట్టుకుంటుంటే, అధికార పార్టీ నాయకులు మాత్రం సొంత పనులకు మట్టి కొట్టేస్తున్నారు. 





Updated Date - 2022-04-25T06:01:52+05:30 IST