అవక..తవ్వకాలు

ABN , First Publish Date - 2022-03-05T06:05:05+05:30 IST

అవక..తవ్వకాలు

అవక..తవ్వకాలు
పల్లెతుమ్మలపాలెంలో డ్రెయినేజీ భూమిని ఆక్రమించి తవ్వుతున్న చెరువులు

ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా చెరువుల తవ్వకం

డ్రెయిన్లనూ వదలని అధికార పార్టీ నాయకులు

డ్రెయినేజీని పూడ్చేసి.. చెరువులుగా మార్చేసి..

70 ఎకరాల ప్రభుత్వ భూమిపైనా కన్ను

చెరువులుగా మార్చి లీజుకు ఇచ్చేందుకు ఒప్పందాలు

పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప గ్రామాల్లో అక్రమాలు


‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..’ అడ్డుపడే వారూ లేరు, అధికారుల అడ్డగింపులూ లేవు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తోచిన విధంగా చెరువులు తవ్వేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు కోట్లకొద్దీ కూడగడుతున్నారు. బందరు మండలం పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప గ్రామాల్లో డ్రెయినేజీ కాల్వనే కాదు.. 70 ఎకరాల ప్రభుత్వ భూమినీ ఇష్టానురీతిగా తవ్వేసి చెరువులుగా మార్చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ భూములతో పాటు డ్రెయినేజీ కాల్వలను సైతం పూడ్చి చెరువులుగా మార్చేస్తున్నారు. బందరు మండలం పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప గ్రామాల్లో ప్రభుత్వ భూములను రొయ్యల చెరువులుగా మార్చేసే పని కొద్దిరోజులుగా ముమ్మరంగా సాగుతోంది. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ ఆక్రమణలపర్వం సాగుతుండటంతో అధికారులు అటువైపు చూడట్లేదు. 

పల్లెతుమ్మలపాలెంలో.. 

పల్లెతుమ్మలపాలెం గ్రామం సముద్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ గ్రామం పక్కనే కరకట్ట ఉంది. సముద్రానికి ఆటుపోట్లు వచ్చినప్పుడు కరకట్టకు ఉన్న అండర్‌ టన్నెల్‌ ద్వారా నీరు ప్రభుత్వ భూముల్లోకి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ భూములపై కన్నేసిన   కొందరు.. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెండు, మూడెకరాల భూమిని  ఆక్రమించేస్తున్నారు. ముందు చిన్నపాటి చెరువులుగా తవ్వుతున్నారు. కొంతకాలం తరువాత ఆ భూమి తమదేనని చెప్పుకొని పెద్ద చెరువులుగా మార్చేస్తున్నారు. పల్లెతుమ్మలపాలెం గ్రామ సమీపంలో రహదారి రెండో కల్వర్టు వద్ద గతంలో 100 గజాలకు పైగా డ్రెయినేజీ కాల్వ ఉండేది. ఈ కాల్వలోనే స్థానికులు చేపలు, రొయ్యలు పట్టుకునేవారు. దీని పక్కనే వందలాది ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. కొన్నిరోజులుగా డ్రెయినేజీని పూడ్చేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు. పల్లెతుమ్మలపాలెం రహదారి పక్కనే ఉన్న డ్రెయినేజీ కాల్వ భూములను సైతం చెరువులుగా మార్చేస్తున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భూములన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు చెబుతున్నారు.

పోలాటితిప్పలోనూ ఇదే పరిస్థితి

పోలాటితిప్ప గ్రామంలోనూ డ్రెయినేజీలకు అడ్డుకట్ట వేసి మరీ చెరువులు తవ్వేస్తున్నారు. పాతేరు-పోలాటితిప్ప గ్రామాల మధ్యలో 2.5 కిలోమీటర్ల దూరం ఉండగా, ప్రఽధాన రహదారి వెంబడి రోడ్డ్డు మార్జిన్‌ కూడా లేకుండా ప్రభుత్వ భూములను తవ్వేస్తున్నారు. గతంలో టీడీపీ చెందిన ఒకరు ఎకరం చెరువుకు గట్లు వేస్తుంటే, రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని పంపి అధికార పార్టీ నాయకులు పొక్లెయిన్‌ సీజ్‌ చేయించారు. ప్రస్తుతం గ్రామ నలుమూలలా చెరువులు తవ్వుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడ ం లేదో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

70 ఎకరాలపై కన్నేసి..

పల్లెతుమ్మలపాలెం - పోలాటితిప్ప గ్రామాలకు వెళ్లే రహదారి పక్కనే 70 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలో సముద్రపు పోటు వచ్చి పోతూ ఉంటుంది. ఈ భూములపై కన్నేసిన మంత్రి అనుచరుడు ఆ భూమిని ఒక డాక్టరుకు, మాలకాయలంకకు చెందిన మరో వ్యక్తికి చెరువులుగా లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. చెరువుల తవ్వకం బాధ్యత తనదేనంటూ అభయం కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ భూమిలోని నీటిని మొత్తాన్ని కరెంటు మోటార్ల ద్వారా బయటకు తోడేసి ఆరబెట్టారు. వారంలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 50 ఏళ్లుగా ఈ భూమి ఖాళీగానే ఉందని, ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో చెరువులుగా తవ్వేందుకు సిద్ధం చేస్తున్నారని గ్రామస్తులే చెబుతున్నారు. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. 

పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకం పనులను పరిశీలిస్తాం. డ్రెయినేజీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. - డి.సునీల్‌బాబు, తహసీల్దార్‌


Read more