నిరుద్యోగులను ముంచేసిన ‘డయల్’
ABN , First Publish Date - 2022-12-15T01:07:11+05:30 IST
జాతీయ రహదారులు అభివృద్ధి సంస్థ... భారత ఎన్నికల సంఘం... బీఎ్‌సఎన్‌ఎల్... ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఈ సంస్థల్లో చిన్న కొలువు దొరికినా జీవితానికి మార్గం దొరికినట్టే. ఈ సంస్థల పేర్లను ఉపయోగించుకుని నిరుద్యోగులను నిలువునా ముంచేసింది డయల్ సంస్థ.
విజయవాడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారులు అభివృద్ధి సంస్థ... భారత ఎన్నికల సంఘం... బీఎ్‌సఎన్‌ఎల్... ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఈ సంస్థల్లో చిన్న కొలువు దొరికినా జీవితానికి మార్గం దొరికినట్టే. ఈ సంస్థల పేర్లను ఉపయోగించుకుని నిరుద్యోగులను నిలువునా ముంచేసింది డయల్ సంస్థ. నగరంలోని ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి సమీపంలో కొన్నాళ్ల క్రితం డయల్ సంస్థ ఏర్పాటైంది. దీని ప్రచారమంతా ఒక లోకల్ యాప్‌లో సాగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగాల భర్తీకి కేంద్రం శ్రీకారం చుట్టిందని, ఆ ప్రక్రియను డయల్ సంస్థ నిర్వహిస్తోందని యాప్‌లో ప్రచారం జరిగింది. నిరుద్యోగులు సంప్రదించడానికి ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. ఎన్‌హెచ్‌ఏఐ, సీఈసీ, బీఎ్‌సఎన్‌ఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు అనేసరికి అభ్యర్థుల్లో ఆశలు మొలకెత్తాయి. యాప్‌లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేస్తే ఎంజీ రోడ్డులో ని డయల్ సంస్థ చిరునామా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన అభ్యర్థుల నుంచి ప్రొసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.75వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన మొత్తానికి రశీదులిచ్చారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. అనుమానం వచ్చిన కొంతమంది అభ్యర్థులు తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి డయల్ యాజమాన్యం ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. వసూలు చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్యరావుపేట పోలీసులను బుధవారం రాత్రి ఆశ్రయించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన బాధితులు స్టేషన్ వద్ద లబోదిబోమని రోదిస్తున్నారు. దీనిపై ఎస్‌ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.