రూట్మార్చి..
ABN , First Publish Date - 2022-12-15T00:33:23+05:30 IST
నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆంక్షలను ఉల్లంఘిస్తున్నాయి. అక్రమ రవాణాపై పోరాడుతున్న ఆర్టీసీకి మద్దతుగా పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను ఒకటి, రెండు రోజులే పాటించిన ప్రైవేట్ ఆపరేటర్లు ఆ తర్వాత వాటిని మీరుతున్నారు.
ఆంక్ష లను ఉల్లంఘిస్తూ ప్రయాణం
యథావిధిగా స్టేజీ క్యారీయింగ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆంక్షలను ఉల్లంఘిస్తున్నాయి. అక్రమ రవాణాపై పోరాడుతున్న ఆర్టీసీకి మద్దతుగా పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను ఒకటి, రెండు రోజులే పాటించిన ప్రైవేట్ ఆపరేటర్లు ఆ తర్వాత వాటిని మీరుతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులు (స్టేజి క్యారియర్స్ మాత్రమే) నగరంలోకి ప్రవేశించకూడదని పోలీసులు హెచ్చరించినా లెక్కచేయట్లేదు. ప్రస్తుతం సీజన్ నడుస్తోంది. త్వరలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాకపోకలను దృష్టిలో ఉంచుకుని డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు అక్రమ రవాణాపై పోలీసు, రవాణా శాఖలకు ఫిర్యాదులు చేయటం, సొంతంగా పరిరక్షణ దళాలు ఏర్పాటు చేసుకోవటంతో సమస్య జఠిలమైంది. పోలీసు శాఖ నుంచి ఆంక్షలు రావటంతో తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఉలిక్కిపడినా ఇప్పుడు ఆంక్షలను మీరుతూ బస్సులు నడుపుతున్నారు.
యథేచ్ఛగా రాకపోకలు
నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ప్రైవేట్ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, పోలీసు కంట్రోల్ రూమ్, గాంధీనగర్ నుంచి బస్సులు రాకపోకలు సాగించాయి. పైన చెప్పుకొన్న ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు యథావిధిగా, నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారీయింగ్ చేశాయి. బెంజిసర్కిల్ నుంచి ఎస్వీఎస్ జంక్షన్ వెళ్లే సర్వీసు రోడ్డులో ఏకంగా ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనే ప్రైవేట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బోర్డే పెట్టేసింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ఇంటర్‌స్టేట్ రూట్లతో పాటు వైజాగ్, తిరుపతికి బస్సులు నడుపుతున్నట్టుగా బోర్డులో పేర్కొంది.
ప్రైవేట్ ఆపరేటర్ల అంతర్గత సమావేశం
పలువురు ప్రైవేట్ ఆపరేటర్లు అంతర్గత సమావేశం నిర్వహించుకోవటం ఇప్పుడు చర్చకు దారితీసింది. తమను నియంత్రించే అధికారం పోలీసులకు లేదని, ఆంక్షలు విధించటానికి పోలీసులెవరని చర్చించుకున్నట్టు తెలిసింది. తమపై చట్టప్రకారం ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సింది రవాణా శాఖ మాత్రమేనని, పోలీసుల ఆంక్షలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పలువురు ఆపరేటర్లు పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో రవాణా శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.