పోర్టుకు టెండర్.. కథ మళ్లీ మొదటికి..
ABN , First Publish Date - 2022-01-13T06:09:29+05:30 IST
పోర్టుకు టెండర్.. కథ మళ్లీ మొదటికి..
- బందరు పోర్టు టెండర్ల కథ మళ్లీ మొదటికి..
- మూడుసార్లు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఫలితం శూన్యం
- కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రద్దు
- ఆర్థికాంశాల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేక..
బందరు పోర్టు నిర్మాణం కథ కంచికి చేరినట్టేనా? కొన్నేళ్లుగా జిల్లా ప్రజలు పోరాడి సాధించుకున్న పోర్టు టెండర్ల దశ దాటి అడుగు ముందుకు పడకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏడాదిగా మూడుసార్లు గ్లోబల్ టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదనే కారణం చూపి టెండర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పోర్టు నిర్మాణాన్ని మరోమారు ప్రశ్నార్థకం చేసింది.
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు టెండర్ల దశ దాటకపోవడం, ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం పోర్టు నిర్మాణం పూర్తి చేస్తుందా? అనే సందేహం కలుగుతోంది.
డీసీఆర్‌ను ఆమోదించినా..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైట్స్ సంస్థ బందరు పోర్టు నిర్మాణంపై డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఇటీవల తయారు చేసింది. కొద్దిపాటి మార్పులతో ఈ డీపీఆర్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. తొలి విడత 2,328 ఎకరాల్లో రూ.1,860 కోట్లతో మూడు బెర్తులు, బ్రేక్ వాటర్, విద్యుత్ ప్లాంట్లు, రైల్ కమ్ రోడ్డు మార్గాలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వమే పోర్టును నిర్వహిస్తుందని, పనులు మాత్రం కాంట్రాక్టర్ ద్వారా చేయిస్తామని పాలకులు చెబుతూ వస్తున్నారు.
విధివిధానాలపై లేని స్పష్టత
రెండు విడతల్లో రూ.12 వేల కోట్లతో నిర్మించే బందరు పోర్టుకు ప్రభుత్వం ఎంతవరకు నగదు సమకూరుస్తుంది? ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లేందుకు బ్యాంక్ గ్యారెంటీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పోర్టు పనులు చేసే కాంట్రాక్టరుకు నగదు చెల్లింపులు ఎలా చేస్తారు? అనే విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. స్టేట్ మేరటైన్ బోర్డు ద్వారా పోర్టు నిర్మాణానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసేందుకు ముందుకు రావట్లేదు.
భూసేకరణ జరిగినా..
పోర్టు నిర్మాణం కోసం 2017లో కరగ్రహారం, మంగినపూడి, తపశిపూడి, చిలకలపూడి, గిలకలదిండి తదితర గ్రామాల్లో 2,328 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించారు. అదే ఏడాది నవంబరులోకాకినాడ పోర్టు డైరెక్టర్‌కు ఈ భూమిని అప్పగించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ద్వారా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి 530 ఎకరాలు సేకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణం కోసం 750 ఎకరాల పట్టా భూమిని, ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రైతులకు చెల్లించి ముడా ద్వారా కొన్నారు.
ఎన్నికల హామీయేనా?
వైసీపీ నాయకులు బందరు పోర్టు నిర్మాణ అంశాన్ని 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా వాడుకున్నారు. 2004 నుంచి పోర్టు నిర్మాణం కోసం విడతలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. తాజా పరిణామాలతో అసలు పోర్టు నిరిస్తారా? లేదా? అనే సందేహం కలుగుతోంది.