అధికారం పోతుందని సీఎం జగన్ భయపడుతున్నారు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-04-27T18:39:33+05:30 IST
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆందోళన చేపట్టారు.

విజయవాడ: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ నేత బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ అధికారం పోతుందని సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుంటే అప్రూవరుగా మారతానని విజయసాయి రెడ్డి జగన్‌కు స్పష్టం చేశారని, బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. పక్కన పెట్టిన విజయసాయి రెడ్డికి అందరికంటే పెద్ద పదవి ఇచ్చారన్నారు. విజయసాయిని సీఎం జగన్ పక్కన పెట్టారని తాము అనడం లేదని, వైసీపీ నేతలే అంటున్నారన్నారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే అందుకు బ్లాక్ మెయిలే కారణమన్నారు.
మంత్రి వర్గం కూర్పులోనూ సీఎం జగన్ భయపడ్డారని, తాను తొలగించాలనుకున్న వారికి తిరిగి మంత్రి పదవులిచ్చారని, పదవులివ్వలేని వాళ్లను బుజ్జగించారని బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రికి భయం లేదని కొడాలి నాని అన్న మాటలు అవాస్తవమని తేలిపోయిందన్నారు. చంద్రబాబుకు నోటీసులిస్తే జగన్ వద్ద మార్కులు పడతాయని వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారని, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే స్థాయి ఆమెకు లేదన్నారు. ఆ నోటీసు చెత్త కాగితంతో సమానమన్నారు. అధికారులు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. గౌతమ్ సవాంగ్ ఏమయ్యారో చూశారా..? అని అన్నారు. అచ్చెన్నాయుడుని ఆంబోతన్న రోజా.. ముందుగా తనను తాను అద్దంలో చూసుకోవాలన్నారు. రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదని, మంత్రిగా ఉన్న రోజా హుందాగా వ్యవహరించాలని బుద్దా వెంకన్న సూచించారు.