పుస్తక మహోత్సవం నేటి నుంచే

ABN , First Publish Date - 2022-01-01T06:51:53+05:30 IST

అక్షర చైతన్యం వెల్లివిరిసే విజయవాడ పుస్తక సంబరాలకు సిద్ధమయింది.

పుస్తక మహోత్సవం నేటి నుంచే

సిద్ధమైన స్వరాజ్య మైదానం

ప్రారంభించనున్న గవర్నర్‌ హరిచందన్‌

150 మంది ప్రచురణకర్తల రాక

సాహిత్య వేదికకు కాళీపట్నం రామారావు పేరు

సందర్శన వేళలు : మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.30 వరకు 


అక్షర చైతన్యం వెల్లివిరిసే విజయవాడ పుస్తక సంబరాలకు సిద్ధమయింది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు జరిగే 32వ విజయవాడ పుస్తక మహోత్సవానికి మహాత్మాగాంధీ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ 11 రోజులూ ప్రతి సాయంత్రం పుస్తకాల మధ్యే నగరవాసుల ఆహ్లాదభరిత సంచారం. అక్షరం చుట్టూనే ముచ్చట్లు..


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పుస్తక ప్రియుల సంబరాలు మరికొద్ది గంటల్లో ఆరంభం కానున్నాయి. ఏడాది విరామం తర్వాత సాహిత్యవాడ విజయవాడలో తిరిగి పుస్తక ప్రియుల సందడి కనిపించనున్నది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలో నిర్వహించనున్న 32వ విజయవాడ పుస్తక మహోత్సవాలను శనివారం రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభించనున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి దాదాపు 150 మంది ప్రచురణకర్తలు వస్తున్నారు. 2020లో మొత్తం 260 మంది ప్రచురణకర్తలు ఇక్కడికి వచ్చారు. 2021 జనవరిలో జరగాల్సిన పుస్తక మహోత్సవం కొవిడ్‌ కారణంగా జరగలేదు. విజయవాడలో పుస్తక మహోత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టిన తరువాత అవాంతరం ఏర్పడింది ఒక్క ఏడాది మాత్రమే. 

ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. ప్రధాన వేదికకు కాళీపట్నం రామారావు సాహిత్య వేదికగా నామకరణం చేశారు. ప్రతిభ వేదికకు డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ వేదికగా నామకరణం చేశారు. 2020లో వచ్చిన ప్రచురణకర్తల కంటే ఈ ఏడాది వచ్చే ప్రచురణకర్తల సంఖ్య బాగా తగ్గింది. ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంటుందనే భావనతో చాలా మంది ప్రచుకరణకర్తలు ఈసారి పుస్తక మహోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. ప్రచురణకర్తలు తగ్గడంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నిర్వాహకులు 150 స్టాల్స్‌ మాత్రమే ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-01T06:51:53+05:30 IST